Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ సగటుకంటే రెట్టింపు వేతనాలు
- గుజరాత్, మధ్యప్రదేశ్లో అధమం
న్యూఢిల్లీ : గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ రంగం, వ్యవసాయం, వ్యవసాయేతర పనుల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు గత ఐదేళ్లలో స్వల్పంగా పెరిగాయి. అయితే రాష్ట్రాల వారీగా చూసినప్పుడు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. జాతీయ సగటుతో పోలిస్తే రెట్టింపు పైగా వేతనాలతో కేరళ అగ్రభాగంలో నిలించింది. ఆ తర్వాత స్థానాల్లో జమ్ముకాశ్మీర్, తమిళనాడు ఉన్నాయి. బిజెపి పాలిత గుజరాత్ జాతీయ సగటు కంటే అత్యల్ప వేతనాలతో దేశంలోనే అట్టుడుగున నిలిచింది. రిజర్వుబ్యాంకు ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. వ్యవసాయేతర పనుల్లో ఉపాధి పొందుతున్న కార్మికుల దినసరి వేతనాలు పరిశీలించినప్పుడు 2020-21లో కేరళలో దినసరి కార్మికుడి రోజువారీ వేతనం రూ.677.6 గా ఉంది. ఇది జాతీయ సగటు వేతనం రూ.315.3తో పోలిస్తే రెట్టింపు కంటే అధికం. పారిశ్రామికంగానూ, వ్యవసాయోత్పత్తుల్లో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా పేరున్న మహారాష్ట్రలో గ్రామీణ ప్రాంత కార్మికుడి దినసరి వేతనం రూ.262.3 మాత్రమే. బిజెపి అభివృద్ధి నమూనాగా గొప్పలు చెప్పుకునే గుజరాత్లో గ్రామీణ కార్మికుల వేతనం దేశంలోనే అతితక్కువగా ఉంటోంది. ఆ రాష్ట్రంలో దినసరి వేతనం రూ.239.3 మాత్రమే. ఉత్తరప్రదేశ్లో రూ.286.3గానూ, బీహార్లో రూ.289.3గానూ ఉంటోంది. కేరళ తర్వాత అత్యధిక వేతనాలు అందుతున్న రాష్ట్రాల్లో జమ్ముకాశ్మీర్ రూ.484, తమిళనాడు రూ.449.5తో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. గణాంకాలు సేకరించిన 20 రాష్ట్రాల్లో జాతీయ సగటు వేతనం కంటే చాలా తక్కువ స్థాయిలో గ్రామీణ కార్మికుల వేతనాలున్న రాష్ట్రాలు 15 ఉండటం గమనార్హం. నిర్మాణ రంగం, వ్యవసాయరంగంలో వేతనాలు కూడా ఇదే రీతిలో ఉన్నాయి. ఈ మూడు రంగాల్లోనూ కేరళలోనే అత్యధిక వేతనాలు లభిస్తుండగా గుజరాత్లో అత్యల్ప వేతనాలు లభిస్తున్నాయి.