Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మాజీ ముఖ్య గణాంక అధికారి ప్రణబ్సేన్
న్యూఢిల్లీ : ప్రయివేట్ వ్యయం, ఉపాధిరంగం, ఎంఎస్ఎంఈ..సంబంధించి సమస్య చాలా తీవ్రంగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థను దేవుడే రక్షించాలని కేంద్ర మాజీ ముఖ్య గణాంక అధికారి ప్రణబ్సేన్ అన్నారు. ఆర్థికరంగంలో మనముందు ఉన్న సమస్యలు పరిష్కరించటం అంత సులభం కాదని చెప్పారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..''రెండో త్రైమాసికం జీడీపీ గణాంకాల్లో అనేక విషయాలున్నాయి. వాటిని మనం గుర్తించటం లేదు. దేశంలో రెండు రకాల వృద్ధి కనపడుతోంది. ఇంతకుముందు దేశం కోసం 'వి-ఆకృతి' వృద్ధి నమోదైంది. ఈ వృద్ధిలో 70-80శాతం ప్రజలుండేవారు. కానీ అది ఇప్పుడు ఆగిపోయింది. వృద్ధిలో కె-ఆకృతి నమోదవుతోంది. దేశం రెండంకెల వృద్ధి సాధ్యమేగానీ, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి చూస్తే చాలా కష్టం. వాస్తవానికి జీడీపీ వృద్ధి గత ఏడాదితో పోల్చితే 7.3శాతం పడిపోయింది'' అని అన్నారు.
దేశంలో ప్రయివేటు పెట్టుబడులపై స్పందిస్తూ, ''ప్రయివేట్ పెట్టుబడిలో వృద్ధి 11శాతం నమోదైంది. అయితే కరోనా ముందునాటి సమయంతో పోల్చితే వృద్ధి 1.5శాతమే ఉంది. దీనిని బట్టి ఉపాధి కల్పనలో వీరి పాత్రను మనం అంచనా వేసుకోవచ్చు. ఇప్పుడు కనపడుతున్న ప్రయివేట్ పెట్టుబడి ముందు ముందు మరింత పెరగకపోతే, నమోదైన వృద్ధి ఒక ఏడాదిలో కనుమరుగు అవుతుంది'' అని అన్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రయివేట్ వ్యయం 55శాతం ఉన్నప్పటికీ, కరోనా ముందునాటి కాలంతో పోల్చితే ఇది సరిపోదని అన్నారు. జీడీపీలో 30శాతం వాటా కలిగిన ఎంఎస్ఎంఈల ద్వారా 80-85శాతం ఉపాధి ఏర్పడుతోందని చెప్పారు. అయితే రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాల ద్వారా తెలిసిందేమంటే, ప్రయివేట్ వ్యయం, ఎంఎస్ఎంఈ రెండూ సమస్యలు ఎదుర్కొంటున్నా యని చెప్పారు. ఈ సమస్యల్ని గనుక కేంద్రం పరిష్కరించకపోతే దేశ ఆర్థిక వ్యవస్థను దేవుడే కాపాడాలని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వ్యయం పెరగాలి..
ప్రభుత్వ పెట్టుబడులను పెంచే శక్తి కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ఇప్పుడు చేస్తున్నదానికన్నా చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. వాస్తవానికి ప్రభుత్వ పెట్టుబడి పెరగటంలో రాష్ట్రాలదే ప్రధాన పాత్రగా ఉంది. రాజకీయ విభేదాల కారణంగా కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అది ప్రభుత్వ పెట్టుబడిపై ప్రభావం చూపుతోంది. ఈ సమస్యల పరిష్కారంపై దృష్టిసారించకుండా దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దలేరని ఆయన చెప్పారు.