Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10లక్షల మందికి పైగా పాల్గొన్న కార్మికులు
- కార్మిక వర్గానికి సీఐటీయూ అభినందనలు
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో నిర్మాణ కార్మికులు సమ్మె నిర్వహించారు. సీఐటీయూ అనుబంధ సంస్థ అయిన భారత నిర్మాణ కార్మికుల సమాఖ్య (సీడబ్ల్యుఎఫ్ఐ) ఆధ్వర్యంలో 10లక్షల మందికి పైగా నిర్మాణ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేశారు.
సమ్మెను జయప్రదం చేసినందుకు సీఐటీయూ కార్మికవర్గానికి అభినందనలు తెలియచేసింది. ఈ మేరకు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ఒక ప్రకటన చేశారు. ప్రధానంగా అసంఘటిత రంగంలో ఈ సమ్మె జరిగింది. భవన, ఇతర నిర్మాణ కార్మికుల (ఉపాధి నియంత్రణ, పని పరిస్థితులు) చట్టాన్ని మార్చరాదని, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య, పని పరిస్థితుల నిబంధనావళి-2020తో విలీనం చేయరాదని భవన నిర్మాణ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రాల నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులను కేంద్రం బలోపేతం చేయాలని సిడబ్ల్యుఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం, 1979, భవన, ఇతర నిర్మాణ కార్మికుల చట్టం, 1996, సెస్ చట్టం 1988లకు రక్షణ కల్పించాలన్నది వారి మూడో డిమాండ్‌గా వుంది. ధరలు తగ్గించాలని, నిర్మాణ సామాగ్రిపై జిఎస్టిని తగ్గించాలని, నిర్మాణ రంగంలో వంద శాతం ఎఫ్‌డిఐని అనుమతించరాదని కోరుతున్నారు.
సమ్మె అపూర్వం
కాగా దేశవ్యాప్తంగా సమ్మె జయప్రదమైనట్లు పలు రాష్ట్రాల నుండి వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, అస్సాం, బెంగాల్, కేరళ, కర్నాటక, తమిళనాడు, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, త్రిపుర, జార్ఖండ్‌ల్లో కార్మికులు సమ్మెను విజయవంతం చేశారు. పలు ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయాల వద్ద సమ్మెలు, ప్రదర్శనలు, పికెటింగ్‌లు జరిగాయి. అనంతరం అధికారులకు మెమోరాండాలు అందచేశారు.
పాలక వర్గ దాడులను ప్రతిఘటిస్తూ, సమ్మెకు నాయకత్వం వహించిన సీడబ్ల్యుఎఫ్ఐ నాయకత్వానికి, భవన నిర్మాణ కార్మికులకు తపన్‌సేన్ అభినందనలు తెలియచేశారు.