Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఎస్ఈ సోషియాలజీ పరీక్షలో ప్రశ్న
- ఎక్కడో పొరపాటు జరిగింది : సీబీఎస్ఈ
న్యూఢిల్లీ : సీబీఎస్ఈ టర్మ్-1 సోషియాలజీ (డిసెంబర్ 1న జరిగిన) టెస్ట్‌లో వచ్చిన ఒక ప్రశ్న..సీబీఎస్ఈ అధికారుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఫిబ్రవరి 2002లో ముస్లింలకు వ్యతిరేకంగా గుజరాత్ అల్లర్లు ఏ పార్టీ అధికారంలో ఉండగా జరిగాయి? అని ప్రశ్నాపత్రంలో అడిగారు. ఈ ప్రశ్నకు..ఎ.కాంగ్రెస్ బి.బీజేపీ సి.డెమొక్రాటిక్ డి.రిపబ్లికన్..అనే ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో సమాధానం గుర్తించటం అంత కష్టమేమీ కాదు. అయితే ఇలాంటి ప్రశ్న, అందునా ప్రధాని మోడీ ఆరోపణలు ఎదుర్కొన్న గుజరాత్ అల్లర్లపై ప్రశ్న రావటం చర్చ నీయాంశమైంది. ఆనాడు ముస్లింలను లక్ష్యంగా చేసుకొని గుజరాత్లో సాగిన హత్యాకాండలో వేలాది అమాయక పౌరులు మరణించారు. అల్లర్లు చెలరేగిన సమయంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ప్రధానిగా అటల్ బిహారీ వాజ్‌పేరు, గుజరాత్ సీఎంగా నరేంద్రమోడీ పాలన సాగిస్తున్నారు. అల్లర్లను అరికట్టలేకపోయారని, హిందూత్వ మూకలు పెద్ద ఎత్తున హింసకు దిగేందుకు గుజరాత్ ప్రభుత్వం అవకాశం కల్పించిందని మోడీపై ఆరోపణలున్నాయి. అయితే..ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్రమోడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మత ఘర్షణల అంశంపై సీబీఎస్ఈ పరీక్షలో ప్రశ్న రావటం అందర్నీ ఆశ్చర్యపర్చింది. ప్రశ్నా పత్రం పేజీ ట్విట్టర్లో పోస్ట్ కూడా అయ్యింది. ప్రశ్నా పత్రం రూపొందించటంలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని సీబీఎస్ఈ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. సీబీఎస్ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రశ్నాపత్రంలో ప్రశ్న వచ్చిందని, బాధ్యులైనవారిపై కఠిన చర్య తీసుకుంటామని సీబీఎస్ఈ ఉన్నతాధికారులు మీడియాకు తెలిపారు.