Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఆందోళన
- ఒప్పందం ప్రకారమే కొనుగోలు:కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటూ వరుసగా ఐదో రోజైన శుక్రవారం టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. లోక్‌సభలో వెల్‌లోకి దూసుకెళ్లి ఫ్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ రైతులకు న్యాయం చేయాలంటూ నినాదాలతో హౌరెత్తించారు. ప్రశ్నోత్తరాల సమయంలో పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జీరో అవర్‌లో టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలను తాము ప్రతి రోజూ సభ దృష్టికి తీసుకొచ్చామని అన్నారు. నవంబర్ 28న జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ లేవనెత్తామని, అలాగే బీఏసీ సమావేశంలోనూ లేవనెత్తామని చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామనీ, ఎకరాకు రూ.10 వేలు రైతు బంధు ఇస్తున్నామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ మొత్తం నీరు అందుతున్నదని, అందువల్ల రైతులు వరి పంటను వేస్తున్నారని తెలిపారు. దేశంలోని వరి ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నదని, రాష్ట్రంలో రెండు పంటలు పడుతాయని అన్నారు. ఈ రెండు పంట ధాన్యాన్ని కేంద్రం కొనుగోళ్లు చేయాలని కోరుతున్నామన్నారు. కానీ కేంద్రం ఏవేవో సాకు చూపుతున్నదనీ, తెలంగాణ రైతులు రోడ్డుపైన ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో ఆరు సమావేశాలు జరిగాయనీ, ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొన్నారని, కానీ ఫలితం లేకపోయిందని అన్నారు. ధాన్యం సేకరణపై జాతీయ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులను చించి వెల్‌లోనే విసిరారు.
ఇక రాజ్యసభలో ఇదే అంశాన్ని టీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తారు. టీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు, సురేశ్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతి గింజనూ కొంటామని కేంద్ర మంత్రి రాష్ట్రంలో చెప్పారనీ, దాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. గతేడాది తరహాలోనే 94 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పియూష్ గోయల్ సమాధానం ఇస్తూ తెలంగాణ ప్రభుత్వంతో ముందుగా చేసుకున్న ఒప్పందం (ఎంఓయూ) ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామనీ, ఆ మేరకు ధాన్యం సేకరణ జరుగుతోందని అన్నారు. ఆయా రాష్ట్రాలు తినే బియ్యాన్నే తాము కొనుగోలు చేస్తామని తేల్చి చెప్పారు. భవిష్యత్‌లో పారా బాయిల్డ్ రైస్ పంపిణీ చేయబోమని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందన్నారు. మళ్లీ ఇప్పుడీ అంశాన్ని తెరపైకి తెచ్చి రాజకీయం చేస్తోందని విమర్శించారు. గతంలో ఇచ్చిన టార్గెట్‌నే తెలంగాణ ఇంకా పూర్తిచేయలేదన్నారు. ఇచ్చిన టార్గెట్‌లో 29 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా పెండింగ్‌లో ఉన్నదని తెలిపారు. టార్గెట్ పూర్తి అయితే అప్పుడు మిగతా అంశాలపై చర్చిద్దామని అన్నారు. ధాన్యం సేకరణ విషయంలో అనవసరంగా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌తోనూ మాట్లాడాననీ, వానాకాలం పంట పూర్తిగా కొంటామని చెప్పారు. దేశంలో ప్రతి ఏటా ధాన్యం సేకరణను పెంచుతున్నామని, తెలంగాణ నుంచి కూడా బాగా పెంచామని వివరించారు. 2018-19లో తెలంగాణలో 51.9 లక్షల టన్నులు, 2019-20లో 74.5 లక్షల టన్నులు, 2020-21లో 94.5 లక్షల టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ''ఖరీఫ్ సీజన్లో 50లక్షల టన్నులు ఇస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. 32.66 లక్షల టన్నులే ఇచ్చింది. ఎంఓయూకు కట్టుబడి ఉండాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నా. తెలంగాణ అంచనాలకు, వాస్తవాలకు చాలా తేడా ఉంటోంది. ధాన్యం సేకరణ విషయంలో కర్నాటక నమూనా చాలా బావుంది. దాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరిస్తే బాగుంటుంది. తెలంగాణ నుంచి 24 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనేందుకు ఒప్పందం జరిగింది. దాన్ని 44లక్షల టన్నులకు పెంచాం. ఇప్పటి వరకు 27లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ వచ్చింది. ఇంకా 17లక్షల టన్నులు పెండింగ్‌లో ఉన్నది. పెండింగ్ ధాన్యం పంపకుండా భవిష్యత్ గురించి ప్రశ్నిస్తోంది'' అని పేర్కొన్నారు. ''భవిష్యత్‌లో బాయిల్డ్ రైస్ కొనబోమని ముందుగానే చెప్పాం. ఈ విషయాన్ని ఎంఒయులో స్పష్టంగా పేర్కొన్నాం. అయినా భవిష్యత్ గురించి ప్రశ్నిస్తూ టీఆర్ఎస్ గందరగోళం సష్టిస్తోంది. ఇకపై బాయిల్డ్ రైస్ పంపబోమని అక్టోబర్ 4న తెలంగాణ లేఖ రాసింది. ఇప్పుడు మాత్రం బాయిల్డ్ రైస్ కొనాలని పదేపదే గొడవ చేస్తున్నారు.
ధాన్యం విషయాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారో అర్థం కావట్లేదు. భౌతిక తనిఖీల కోసం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు తెలంగాణకు వెళ్లారు. ఆ రాష్ట్రం ధాన్యం లెక్కలను సరిగా నిర్వహించడం లేదు. ధాన్యం సేకరణ కేంద్రానికి కొత్త కాదు. ఏండ్ల తరబడి ఓ పద్ధతి ప్రకారం జరుగుతున్న ప్రక్రియే. కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత వరకూ తెలంగాణకు సహకరిస్తోంది'' అని పేర్కొన్నారు. బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర పారాబాయిల్డ్ బియ్యం గురించి లేవనెత్తారు. దీనిపై కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ పారాబాయిల్డ్ బియ్యం వినియోగం తగ్గిందని, డిమాండ్ కూడా తగ్గిందని అన్నారు. డిమాండ్ పెరిగితే తాము కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే జీరో అవర్‌లో బీజేడీ సభ్యుడు ప్రసన్న ఆచార్య మాట్లాడుతూ పారా బాయిల్డ్ ధానం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఒడిశా, తెలంగాణ, తమిళనాడులో రైతులు ఈ పంట వేస్తారని, పంట కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.