Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోట్లలో లాభాలార్జించే సీఈఎల్పై ప్రై'వేటు'
- నిరసిస్తున్న కార్మిక లోకం
న్యూఢిల్లీ : జాతీయాస్తులన్నింటినీ చవకగా విక్రయించడానికి మోడీ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా తాజాగా ఘజియాబాద్‌లోని సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సీఈఎల్) తెరపైకి వచ్చింది. దేశంలోని లేబరేటరీలు, ఆర్ అండ్ డి సంస్థలు వృద్ధిచేసే దేశీయ సాంకేతికతలను వాణిజ్యపరంగా ఉపయోగించుకునే లక్ష్యంతో 1974లో ఏర్పడిన సీఈఎల్లో ప్రస్తుతం 1500మందికి పైగా కార్మికులు వున్నారు. సౌర విద్యుత్, రైల్వే సిగలింగ్, రక్షణ ఎలక్ట్రానిక్స్, సమగ్ర భద్రత, నిఘా వంటి ప్రధానమైన నాలుగు రంగాల్లో ఇది పనిచేస్తోంది. ప్రైవేటు సంస్థలు వెళ్ళడానికి నిరాకరించిన మారుమూల, కొండ ప్రాంతాల విద్యుద్దీకరణలో సీఈఎల్ ముఖ్యమైన పాత్ర పోషించింది. క్షిపణి వ్యవస్థల్లో ఉపయోగించే ఫేజ్ కంట్రోల్ మాడ్యూల్ (పీసీఎం) వంటి అధునాతన ఉత్పత్తులను రూపొందించింది. భారతదేశ భద్రతలో ఈ సంస్థకు వ్యూహాత్మక ప్రాముఖ్యత వుంది. సౌర విద్యుత్‌ను పెంపొందించాలని మాట్లాడే మోడీ ఇప్పుడు లాభాలు ఆర్జించే ప్రభుత్వరంగ సంస్థను, సౌర విద్యుత్ తయారీలో పేరొందిన సీఈఎల్‌ను విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. స్వతంత్ర అంచనాల ప్రకారం ఈ సంస్థ విలువ రూ.957కోట్లు వుండగా, కేవలం రూ.210కోట్లకు సిఇఎల్ను అమ్మకానికి పెట్టడాన్ని సంయుక్త కర్మచారి సంఘటన్ (సీఈఎల్లోని అన్ని కార్మిక సంఘాల సంయుక్త వేదిక) తీవ్రంగా నిరసించింది. ఘజియాబాద్‌లో సంస్థ వున్న ప్రాంతం విలువను లెక్కగట్టినా రూ.680కోట్ల వరకు వుందని, అటువంటిది ఇంత తక్కువ మొత్తాలకు ఎలా విక్రయిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పైగా గత 8ఏండ్లుగా సీఈఎల్ లాభాల బాటలో నడుస్తోంది. 2020-21లో లాభాలు రూ.23కోట్లు వుండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1500కోట్ల మేరకు బుకింగ్స్ జరిగాయి. అంతర మంత్రిత్వ శాఖల గ్రూపు, కార్యదర్శుల కోర్ గ్రూపులతో కలిసి పలు దశల్లో నిర్ణయాక క్రమం సాగిందని ప్రభుత్వం చెప్పుకుంటోంది కానీ వాస్తవానికి టెండరు మొత్తాల్లో పోటీని తప్పించడానికి కేవలం రెండు సంస్థలు మాత్రమే ఇందులో పాల్గొన్నాయని సంయుక్త వేదిక తెలిపింది. మోడీ ప్రభుత్వ చర్యల పట్ల కార్మికులు తీవ్ర ఆందోళన సాగిస్తున్నారు.
మోడీ ప్రభుత్వం సాగిస్తున్న జాతి వ్యతిరేక, అవినీతి చర్యలను నిరసిస్తూ, సీఈఎల్ కార్మికులు అకుంఠిత దీక్షతో సాగిస్తున్న పోరాటానికి సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కమిటీ అభినందనలు తెలియచేసింది. రైతాంగం తర్వాత, ఆత్మనిర్భర్, స్వదేశీ నినాదాల్లోని బూటకాన్ని బహిర్గతం చేయడం ఇక కార్మికుల వంతని పేర్కొంది. సీఈఎల్ పెట్టుబడుల ఉపసంహరణ కుంభకోణంపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలని సీఈఎం డిమాండ్ చేసింది. లాభాలార్జించే ప్రభుత్వ రంగ సంస్థ నుండి ఇలా పెట్టుబడులు ఉపసంహరించడాన్ని తక్షణమే నిలుపుచేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది.