Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 73 శాతానికి పైగా వారే.. : కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలోని మొత్తం పారిశుధ్య కార్మికుల్లో (మ్యాన్యువల్ స్కావెంజర్లు) 73 శాతం మందికి పైగా షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ)కు చెందినవారే ఉన్నారు. ఈ విషయాన్ని పార్లమెంటులో కేంద్రం వెల్లడించింది. దీనిపై ఆర్జేడీ సభ్యుడు మనోజ్‌కుమార్ ఝా లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే రాజ్యసభలో సమాధానాన్ని వెల్లడించారు. మ్యాన్యువల్ స్కావెంజింగ్ చట్టం, 2013లోని నిబంధనల ప్రకారం దేశంలోని మ్యాన్యువల్ స్కావెంజర్లపై అనేక సర్వేలు నిర్వహించినట్టు మంత్రిత్వశాఖ తెలిపింది. వీరిలో ఎక్కువ మంది ఎస్సీలే ఉన్నారన్న విషయాన్ని ఈ సర్వేలు ధ్రువీకరించాయని వివరించింది. కేంద్ర మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. దేశంలో మొత్తం 58,098 మంది మ్యాన్యువల్ స్కావెంజర్లు ఉన్నారు. వీరిలో 42,594 మంది ఎస్సీలు ఉన్నారు. ఇక 431 మంది ఓబీసీలు, 421 మంది ఎస్టీలు, 351 మంది ''ఇతర'' వర్గానికి చెందినవారున్నారు. 2013లో మ్యాన్యువల్ స్కావెంజింగ్ రద్దయిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి మ్యాన్యువల్ స్కావెంజర్ల నియామకానికి ఫుల్స్టాప్ పడింది.