Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంటులో గాంధీ సాక్షిగా బీజేపీ ఎంపీల దౌర్జన్యం
- శాంతియుత నిరసనలను రెచ్చగొట్టే యత్నం
- పరస్పరం నినాదాలు.. తోపులాట..ఉద్రిక్తత
పార్లమెంటులో మహాత్మాగాంధీ విగ్రహం సాక్షిగా అధికార బీజేపీ ఎంపీలు దౌర్జాన్యానికి పాల్పడ్డారు. రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయబడిన ప్రతిపక్ష ఎంపీలు 12 మంది గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన తెలుపుతున్న సమయంలో బీజేపీ ఎంపీలు వారిని రెచ్చగొట్టేలా ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ దౌర్జన్యానికి బరితెగించారు. ఈ దుందుడుకు చర్యను లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా గర్హించారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపే హక్కు తమకూ ఉందంటూ బీజేపీ ఎంపీలు ఎదురుదాడికి దిగి, తమ దౌర్జన్యాన్ని సమర్ధించుకొనే ప్రయత్నం చేశారు.
న్యూఢిల్లీ: సస్పెన్షన్ ఎత్తివేసి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ సస్పెండ్ అయిన 12 మంది ఎంపీలు గత ఐదు రోజులుగా పార్లమెంట్ ఆవరణంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్నారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. వారికి సంఘీభావంగా మిగతా ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం కూడా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సస్పెండ్ అయిన ఎంపీలు తమ ఆందోళన కొనసాగించారు. వారికి మద్దతుగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు అక్కడే ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాల హౌరెత్తించారు. అయితే అదే సమయంలో బీజేపీ ఎంపీలు అక్కడికి చేరుకొని కౌంటర్ ఆందోళన చేపట్టారు. సభలోనూ ఫోటోలను పట్టుకొని అక్కడికి చేరుకొని నినాదాలు ఇచ్చారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు కూడా ''కిసాన్ విరోధి మోడీ సర్కార్. వురు వాంట్ జస్టిస్'' అంటూ నినాదాలు చేపట్టారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఫోటోలు తీసుకున్న తరువాత బీజేపీ ఎంపీలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అప్పుడు పరిస్థితి సద్దుమణిగింది. బీజేపీ రెచ్చగొట్టే విధానంపై ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతూ ''బీజేపీని ఎవరు గైడ్ చేస్తున్నారు. తాము గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్నప్పుడు 30-40 మంది బీజేపీ ఎంపీలు వచ్చి రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేశారు. అక్కడ ఉద్రిక్తత వాతావరణాన్ని సృష్టించారు. మర్యాద లేకుండా, తాము కూర్చొన్న బ్లాంకెట్స్‌ను తొక్కుకుంటూ రచ్చ చేశారు. అరుపులు, కేకలతో రెచ్చగొట్టారు. దీని అర్థం ఏమిటీ? ప్రజాస్వామ్యంలో బీజేపీ ఇలానే పని చేయాలనుకుంటుందా? ఇదేనా మన దేశ సంస్కృతి? ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇది దేశ సంస్కృతి కాదు. తమను ఏడాదికిపైగా ఆందోళన చేస్తున్న రైతులు గైడ్ చేశారు. వారి ఉద్యమ బాటలో తాము నడుస్తున్నాం. వారే మాకు నేతలు. మార్గదర్శకులు. మహాత్మా గాంధీని చంపిన వారి సిద్ధాంత నుంచి బీజేపీ పని చేస్తుంది. ఇదే తమకు బీజేపీకి మధ్య తేడా. తమ పోరాటం కొనసాగిస్తాం'' అని స్పష్టం చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద అధికార ప్రతిపక్షాల పోటాపోటీ నిరసనలపై లోక్‌సభలో దుమారం రేగింది. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న గాంధీ విగ్రహం వద్దకు బీజేపీ సభ్యులు వెళ్లి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి విమర్శించారు. బీజేపీ సభ్యుల రెచ్చగొట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టే హక్కు అధికారపక్ష ఎంపీలకు కూడా ఉన్నదని అన్నారు. లోక్‌సభలో శుక్రవారం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సవరణ) బిల్లు, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (సవరణ) బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ఉపయోగించుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శించాయి.