Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియాలో బొగ్గు తవ్వకాల ప్రాజెక్ట్‌కు మార్గం సుగమం
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాలో అదానీ గ్రూప్ బొగ్గు తవ్వకాల ప్రాజెక్ట్‌కు మార్గం సుగమమైంది. దశాబ్దకాలంగా క్వీన్స్లాండ్ ప్రజలు, పర్యావరణ ప్రేమికులు, హక్కుల కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలను ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కదలించలేక పోయాయి. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు, బడా కార్పొరేట్ అయిన గౌతం అదానీకి ఆస్ట్రేలియా ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలబడింది. దాంతో అక్కడ అదానీ కంపెనీ ప్రాజెక్ట్‌కు అన్ని అనుమతులు దక్కాయి. ఆస్ట్రేలియా బొగ్గును విదేశాలకు సరఫరా చేసేందుకు అదానీ గ్రూప్ అన్ని ఏర్పాట్లూ చేసుకుంది. ఈనేపథ్యంలో అదానీ కంపెనీ బొగ్గు భారత్‌కు దిగుమతి చేసి, ఇక్కడున్న థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి చేపడతారని సమాచారం. ఆస్ట్రేలియా నుంచి కోటి టన్నుల బొగ్గు ఈనెలాఖరు కల్లా భారత్‌కు రాబోతున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన కార్గో ఓడల షెడ్యూల్ కూడా సిద్ధమైందని అదానీ కంపెనీ వర్గాలు మీడియాకు తెలిపాయి.
క్వీన్స్‌లాండ్‌లో కార్మిఖాల్లో విస్తారంగా ఉన్న బొగ్గు ఇకపై అమెరికా, భారత్, జపాన్, చైనా, ఇతర దక్షిణాసియా దేశాలకు సరఫరా చేయాలని అదానీ గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. 2010లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌కు స్థానిక ప్రజల నుంచి, పర్యావరణ ప్రేమికుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం అదానీ గ్రూప్ అక్రమంగా రుణాలు సేకరించిందని, పర్యావరణాన్ని దెబ్బతీస్తుందని న్యాయస్థానాల్లో పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి అదానీ గ్రూప్‌నకు గట్టి మద్దతు లభించటంతో దాదాపు 100కుపైగా వివిధ విభాగాల నుంచి అన్ని రకాల అనుమతులు దక్కాయి. ఈ ప్రాజెక్ట్ నిమిత్తం రుణాలు ఇచ్చిన ప్రభుత్వ, ప్రయివేట్ బ్యాంకుల ముందు, ఇన్సూరెన్స్ కంపెనీల ముందు, పెట్టుబడిదారుల ముందు పర్యావరణ ప్రేమికులు నిరసనలు చేపట్టారు. పర్యావరణానికి పెను ముప్పుగా మారిన ఈ ప్రాజెక్ట్‌కు సహకరించవద్దని కోరారు.
హానికారకమైన పెట్టుబడి : సమంతా హిబర్న్, న్యాయ నిపుణుడు, మెల్బోర్న్
రాబోయే కాలంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కోసం కార్మిఖాల్లో బొగ్గును పెద్ద ఎత్తున వినియోగించబోతున్నారు. ప్రపంచ పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది కేవలం పర్యావరణ కార్యకర్తలకు సంబంధించిన అంశం కాదు. ఈ తరహా పెట్టుబడుల్ని, పర్యావరణానికి హానికరమైన ప్రాజెక్ట్‌లను చేపట్టవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. క్వీన్స్లాండ్ సముద్రతీరం వెంబడి బొగ్గు నిక్షేపాలు అదానీ గ్రూప్ చేతుల్లోకి వెళ్తాయన్న ఆందోళన ఉంది. బ్రిటన్ దేశమంత ఉండే 'గలెలీ బేసిన్'లో బొగ్గు నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. 200 కిలోమీటర్లతో విస్తరించిన రైలు మార్గం బొగ్గు తవ్వకాలకు అనుకూలంగా ఉంది.