Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన సంగతి తెలియదు
- పార్లమెంట్లో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ : పెగాసస్ నిఘా సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసిన ఇజ్రాయెల్ కంపెనీ 'ఎన్ఎస్ఓ గ్రూప్'పై నిషేధం విధించే ఉద్దేశం లేదని పార్లమెంట్లో కేంద్రం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులపై పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో అక్రమ నిఘా కార్యకలాపాలు సాగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మీడియా సంస్థల పరిశోధనాత్మక జర్నలిజంలో అక్రమ నిఘా సంగతి బట్టబయలైంది. ఈనేపథ్యంలో పెగాసస్ తయారుదారు ఎన్ఎస్ఓ గ్రూప్ కార్యకలాపాల్ని అమెరికా నిషేధించింది. అయితే అమెరికా ఎన్ఎస్ఓపై నిషేధం విధించిన సంగతి తమకు తెలియదని, భారత్‌లోనూ దానిపై నిషేధం విధించాలన్న ప్రతిపాదన కేంద్రం ముందు లేదని పార్లమెంట్లో కేంద్ర సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు విశ్వంభర్ ప్రసాద్ నిషాద్, చౌదరీ సుఖ్రామ్ సింగ్ యాదవ్‌లు అడిగిన ఒక ప్రశ్నకు కేంద్రం పై విధంగా సమాధానమిచ్చింది.
నిఘా కార్యకలాపాలు సాగించే స్పైవేర్ సాఫ్ట్వేర్లను తయారుచేస్తున్నాయన్న కారణంతో ఎన్ఎస్ఓ గ్రూప్, కాండిరు అనే రెండు కంపెనీలపై నవంబర్‌లో అమెరికా నిషేధం విధించింది. ఈ రెండు కంపెనీలను అమెరికా వాణిజ్యశాఖ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. హానికరమైన సైబర్ కార్యకలాపాలకు పాల్పడుతున్న విదేశీ కంపెనీల జాబితాలో చేర్చింది. ఎన్ఎస్ఓ గ్రూప్‌పై నిషేధం విధించారా? పెగాసస్ కుంభకోణంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనిమనదేశంలో ప్రతిపక్షాలు గతకొంత కాలంగా ప్రశ్నిస్తున్నాయి. అయితే ప్రతిపక్షాల ప్రశ్నల్ని మోడీ సర్కార్ తేలిగ్గా తీసుకుంటోంది. పెగాసస్ కుంభకోణంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు సుప్రీంలో దాఖలైన నేపథ్యంలో, సభలో దీనిపై మాట్లాడబోమని వర్షాకాల సమావేశాల్లో కేంద్రం వెల్లడించింది.
అమెరికా ఉన్నతాధికారులపై 'పెగాసస్'తో నిఘా: రాయటర్స్ కథనం
పెగాసస్ స్పైవేర్ అమెరికాలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆఫ్రికా దేశాల వ్యవహారాలతో సంబంధమున్న హోంశాఖ ఉన్నతాధికారుల యాపిల్ ఫోన్లపై గత కొన్ని నెలలుగా పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో నిఘా కార్యకలాపాలు సాగాయని ప్రముఖ మీడియా సంస్థ 'రారుటర్స్' సంచలన కథనం వెలువరించింది. అమెరికా హోంశాఖలోని కనీసం 9మంది ఉన్నతాధికారులపై పెగాసస్ ప్రయోగించారని, ఆ అధికారులు వాడిన యాపిల్ స్మార్ట్ఫోన్లు హ్యాకింగ్ అయ్యాయని ఈ విషయంతో సంబంధమున్న కొంతమంది అధికారులు పేర్కొన్నారని 'రాయటర్స్' తెలిపింది. అమెరికాలోనూ పెగాసస్‌తో నిఘా కార్యకలాపాలు సాగాయని తొలుత రాయటర్స్ బయటపెట్టగా, నిఘా చేపట్టడం నిజమేనని, ఉగాండా, ఆఫ్రికన్ దేశాల వ్యవహారాలపై పనిచేస్తున్న అధికారుల ఫోన్లు హ్యాకింగ్ అయ్యాయని పేరు చెప్పడానికి ఇష్టపడని కొంతమంది అధికారులు అసోసియేట్ ప్రెస్, సీఎన్ఎన్లకు తెలిపారు.
ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూప్ తయారుచేసిన ఈ పెగాసస్ స్పైవేర్‌ను వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు మాత్రమే కొనుగోలు చేయగలవు. అమెరికాలో ప్రభుత్వ ఈమెయిల్స్ కలిగివున్న (స్టేట్.గవ్) అధికారులపై స్పైవేర్‌తో నిఘా పెట్టారని తేలింది. యాపిల్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లను టార్గెట్ చేశారని, సైబర్ దాడులు జరిపి ఆ ఫోన్లలో కెెమెరా, మైక్రోఫోన్ల ద్వారా సున్నితమైన సమాచారాన్ని సేకరించారని 'యాపిల్' కంపెనీ న్యాయస్థానంలో దావా వేసింది. తమ కస్టమర్లు ఇచ్చిన ఫోన్ నెంబర్లను తీసుకొని..వాటిపై పెగాసస్ ప్రయోగించామని, ఆ ఫోన్లు ఏ దేశానికి చెందినవి, ఎవరివి ? అన్నది తమకు తెలియదని ఎన్ఎస్ఓ ప్రకటించింది.