Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల డిమాండ్‌కు కేంద్రంలో కదలిక
- కేసుల ఉపసంహరణపై చర్చలు
- కొన్ని కేసులు ఎత్తివేతకు అంగీకారం
- ప్రభుత్వంతో చర్చలకు ఎస్కేఎం ఐదుగురు సభ్యులతో కమిటీ
న్యూఢిల్లీ: ఏడాదికి పైగా పోరాడుతున్న రైతుల డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం దిగొస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలతో ఎస్కేఎం రాష్ట్ర నాయకత్వం చర్చలు జరుపుతున్నది. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఎస్కేఎం ఐదుగురు సభ్యులతో కమిటీ వేసింది. తాము రైతు సంఘాలతో చర్చిస్తామనీ, ప్రతినిధులను పంపాలని ఎస్‌కెఎం నేత యుధ్వీర్ సింగ్‌కు కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. అందులో భాగంగానే సంయుక్త కిసాన్ మోర్చా ఐదుగురు సభ్యులతో కమిటీ వేసింది. ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపనున్నది. ఇప్పటికే హర్యానాలో రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో చర్చలు జరిగాయి. కేసులు ఉపసంహరణకు అంగీకరించారు. అక్కడ 216 కేసుల్లో 48 వేల మంది రైతులు ఉన్నారు. అయితే అందులో 212 కేసులు ఉపసంహరించుకునేందుకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మిగిలిన నాలుగు క్రిమినల్ కేసులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అక్కడ చర్చలు కొనసాగుతున్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్‌లో కూడా రైతులపై కేసులు ఉపసంహరించుకుంటున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
శనివారం నాడిక్కడ సింఘూ సరిహద్దు వద్ద ఎస్కేఎం జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతుల ఉద్యమంలో పెండింగ్‌లో ఉన్న డిమాండ్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన లేకపోవడంపై చర్చించారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలను ఎస్కేఎం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా సంతృప్తికరంగా స్పందన వచ్చే వరకు రైతుల ఆందోళన యథాతథంగా కొనసాగుతుందని ఏకగ్రీవంగా తీర్మానించారు. తాము లేవనెత్తిన ప్రతి సమస్యపై అధికారిక స్పందన లేకుండా తమ ఉద్యమాన్ని ముగించమని స్పష్టం చేశారు. ఈ ఉద్యమంలో భాగంగా రైతులతో పాటు వారి మద్దతుదారులపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలనీ, అధికారికంగా హామీ వచ్చేలా చూడాలని తాము కోరుకుంటున్నామని ఎస్కేఎం నేతలు స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు అశోక్ ధావలే, బల్బీర్ సింగ్ రాజేవాల్, గుర్నామ్ సింగ్ చదుని, శివ కుమార్ కక్కాజీ, యుధ్వీర్ సింగ్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
రైతుల నుంచి పెండింగ్‌లో ఉన్న ఆరు డిమాండ్లు ఎంఎస్పీ చట్టం, విద్యుత్ బిల్లు ఉపసంహరణ, ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ రెగ్యులేషన్ కమిషన్ చట్టంలో రైతులపై జరిమానాలు విధించే సెక్షన్ 15ను తొలగించడం, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, చండీగఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్ మొదలైన రాష్ట్రాల్లో నిరసన తెలుపుతున్న రైతులు, వారి మద్దతుదారులపై మోపిన కేసుల ఉపసంహరణ, 708 మంది ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు పరిహారం, ఉపాధి, వారి కోసం నిర్మించే స్మారక చిహ్నం కోసం భూమి కేటాయింపు, లఖింపూర్ ఖేరీ రైతుల ఊచకోతలో న్యాయం కోసం అజరు మిశ్రా తేని అరెస్ట్, ఆయనను పదవి నుంచి తొలగించడం డిమాండ్లపై ప్రధాన మంత్రికి లేఖ రాసినట్టు ఎస్కేఎం మరోసారి గుర్తు చేసింది. ఈ డిమాండ్లపై ఐదుగురు సభ్యుల కమిటీ చర్చలు జరుపుతామని ఎస్కేఎం స్పష్టం చేసింది. తదుపరి సమావేశం డిసెంబర్ 7(మంగళవారం)న జరుగుతుందనీ, ఈ రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వ స్పందన బట్టీ తాము నిర్ణయం తీసుకుంటామని ఎస్కేఎం స్పష్టం చేసింది.
రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోని పక్షంలో తాము వెనక్కి వెళ్లబోమని, రైతులపై ఉన్న అన్ని కేసులను వెనక్కి తీసుకుంటే తప్ప ఆందోళనను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతాలు పంపామని రైతు నేత దర్శన్ పాల్ సింగ్ తెలిపారు. ఎస్కేఎం నేత అశోక్ ధావలే మాట్లాడుతూ అమరులైన రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం, రైతులపై పెట్టిన తప్పుడు కేసులు, లఖింపూర్ ఖేరీ ఘటనపై సమావేశంలో చర్చించామన్నారు. రైతు నేత రాకేశ్ తికాయత్ మాట్లాడుతూ తమ ఉమ్మడి రైతుల ఉద్యమం కొనసాగుతోందనీ, అయితే ప్రభుత్వం రైతులతో మాట్లాడాలనుకుంటే, ప్రభుత్వంతో మాట్లాడేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిరంతరం డిమాండ్ చేస్తుందని, దానితో ప్రభుత్వం చర్చలు జరపాలని అన్నారు. ఈ కమిటీ ఇప్పుడు అన్ని అంశాలపై ప్రభుత్వంతో మాట్లాడుతుందని, చర్చల తర్వాత ఈ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అందరికీ తెలుపుతామని అన్నారు. రైతుల సమస్యలు ఇప్పటికీ అలాగే ఉన్నాయని అన్నారు. ఏ సమస్యలపై ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారో, ఆ సమస్యలు ఇంకా సజీవంగానే ఉన్నాయని, ఆ సమస్యలపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసే వరకు ఈ ఉద్యమం ఆగదన్నారు.