Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఏసీ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్
- ప్రధాని మోడీ గైర్హాజరు
న్యూఢిల్లీ: పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పాలనకు జవాబుదారీతనం ప్రధానమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నొక్కి చెప్పారు. రెండు రోజుల పాటు జరిగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) శతాబ్ది ఉత్సవాలు శనివారం నాడిక్కడ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రారంభమైయ్యాయి. ఈ సమావేశంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మెన్ అధిర్ రంజన్ చౌదరి, రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ్ సింగ్, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర శాసనసభల స్పీకర్లు, రాష్ట్రాల పబ్లిక్ అకౌంట్స్ కమిటీల చైర్మెన్లు, విదేశీ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రధాని మోడీని ఆహ్వానించినప్పటికీ ఆయన హాజరు కాలేదు. ఈ సందర్భంగా భారత పార్లమెంట్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సెంటెనియల్ సావనీర్‌ను రాష్ట్రపతి విడుదల చేశారు. పీఏసీ శతాబ్దపు సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రదర్శించే ఎగ్జిబిషన్‌ను కూడా రాష్ట్రపతి ప్రారంభించారు. ఉత్సవాలను ప్రారంభిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పార్లమెంటు ప్రజల సంకల్పానికి ప్రతిరూపమని, పార్లమెంటరీ కమిటీలు దాని విస్తరణగా పనిచేస్తాయనీ, దాని పనితీరును మెరుగుపరుస్తాయని అన్నారు. నిధులు సేకరించడానికి, ఖర్చు చేయడానికి ఎగ్జిక్యూటివ్‌కు అనుమతి ఇచ్చేది పార్లమెంటు కాబట్టి, నిధులు సేకరించి తదనుగుణంగా ఖర్చు చేశారా? లేదా? అని అంచనా వేయాల్సిన బాధ్యత ఉన్నదని అన్నారు. పార్లమెంటరీ కమిటీలు, ముఖ్యంగా పీఏసీ శాసన వ్యవస్థ పట్ల కార్యనిర్వాహకవర్గానికి పరిపాలనాపర మైన జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తాయని తెలిపారు. అవి లేకుంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అసంపూర్ణమవుతుందని, పీఏసీ ద్వారానే పౌరులు ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులను తనిఖీ చేస్తారని రాష్ట్రపతి అన్నారు. మహాత్మా గాంధీ ఆశయాల, అంచనాలకనుగుణంగా పీఏసీ పని చేస్తుందని తెలిపారు. దశాబ్దాలుగా పీఏసీ రికార్డు ప్రశంసనీయమైనదని, ఆదర్శప్రాయమైనదని అన్నారు. పీఏసీ పనితీరు స్వతంత్ర నిపుణులచే కూడా ప్రశంసించబడిందని తెలిపారు. సాంకేతిక అవకతవకలు ఏమైనా ఉంటే కనుగొనడానికి చట్టబద్ధమైన, అధికారిక ధృక్కోణం నుంచి మాత్రమే కాకుండా, ఆర్థిక వ్యవస్థ వివేకం, ఔచిత్య ధృక్పథం నుంచి కూడా కమిటీ ప్రజా వ్యయాన్ని పరిశీలించిందని ఆయన అన్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ శతాబ్ది ఉత్సవాలు కార్యనిర్వాహకవర్గాన్ని మరింత జవాబుదారీగా చేయడానికి, తద్వారా ప్రజల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి మార్గాలను చర్చించడానికి ఒక ఆదర్శ వేదికను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మెన్ ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పబ్లిక్ అకౌంట్స్ కమిటీతో పాటు పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ ప్రభుత్వ కార్యకలాపాలు, ఖర్చులపై 'శాశ్వత నిఘా'ని ఏర్పరుస్తాయని అన్నారు. పబ్లిక్ ఫైనాన్స్ నిర్వహణ ప్రధాన సమస్యగా ఉన్న అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో పీఏసీ జవాబుదారీతనం, పారదర్శకత, సుపరిపాలనను నిర్ధారించడం ద్వారా వ్యర్థమైన వ్యయాలను తనిఖీ చేయడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ప్రజాస్వామ్య సంస్థల పాత్రను నొక్కి చెప్పారు. ఈ సంస్థలు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, వారి అంచనాలను నెరవేర్చడానికి సమర్థవంతమైన వేదికలుగా చూస్తున్నాయని అన్నారు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్పర్సన్ అధీర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా దేశానికి సేవ చేయాలనే భావంతో కమిటీ పనిచేస్తుందన్నారు. ఇది కమిటీ ఐక్యంగా పనిచేయడానికి, పక్షపాత రహిత స్ఫూర్తిని ప్రతిబింబించే ఏకగ్రీవ నివేదికలను సమర్పించే ఆరోగ్యకరమైన సమావేశానికి కట్టుబడి ఉండటానికి వీలు కల్పించిందని అన్నారు.