Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ పాలనలో నిరాశజనకంగా కొనుగోళ్లు
- వరి, గోధుమ, పప్పులు, నూనెగింజలు సహా పలు పంటలదీ ఇదే పరిస్థితి
- ఇప్పటికీ వేగవంతం చేయని కేంద్రం
- రైతన్నపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ధాన్యం సేకరణ విషయంలో మోడీ సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది. రైతులు పండించిన వరి, గోధుమ తో పాటు ఇతర ధాన్యాలను కొనే విషయంలో ఆలస్యం చేస్తున్నది. దీంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంటపై కోటి ఆశలు పెట్టుకున్న రైతన్నకు మోడీ సర్కారు తీరు శాపంగా మారింది. ధాన్యం కొనుగోళ్లు ఆశించినంతగా లేకపోవడం, కేంద్రం దానిని వేగవంతం చేయకపోవడంతో ఇది వారిని ఆర్థికంగా ఇబ్బందుల పాల్జేస్తున్నది.
ఆ మూడు రాష్ట్రాల నుంచే అధికం
గోధుమ, వరి కొనుగోళ్లలో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ ముతక ధాన్యాలు, తృణ ధాన్యాలు, నూనె గింజలు మాత్రం సేకరణ పరిధికి దూరంగానే ఉన్నాయి. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆహార, ప్రజా పంపిణీ విభాగం సమాచారం ప్రకారం.. 2020-21లో దాదాపు 37 శాతం వరి, 36 శాతం గోధుమను ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2015-16లో వరి కొనుగోలు 33 శాతం, గోధుమ సేకరణ 32 శాతంగా ఉన్నది. అయితే, ఇందులో అధిక కొనుగోళ్లు పంజాబ్, హర్యానాతో పాటు మధ్యప్రదేశ్ నుంచి మాత్రమే జరగడం గహనార్హం. యూపీ, బీహార్ లతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వరి, గోధుమ రైతుల నుంచి కేంద్రం సేకరణ జరపకపోవడంతో వారిపై తీవ్రంగా ప్రభావం పడింది. దీంతో వారు చాలా నష్టపోతున్నారు.
ఇతర ధాన్యాలకు సంబంధించిన గణాంకాలు
2020-21లో తృణధాన్యాల కొనుగోళ్లు 9శాతంగా ఉన్నది. ఇక ముతక ధాన్యాల సేకరణ కేవలం 1.4 శాతం. నూనెగింజలదీ అదే పరిస్థితి. మొత్తం ఉత్పత్తిలో ప్రభుత్వం సేకరించింది 3.2 శాతం మాత్రమే కావడం గమనార్హం. పప్పులు, నూనె గింజల సేకరణకు సంబంధించిన సమాచారాన్ని పార్లమెంటులో కేంద్రం వెల్లడించింది. 2015-16లో 0.7 శాతం ముతకధాన్యాల సేకరణ జరిగింది. 2020-21లో ఇది 1.4 శాతానికే పరిమితమైంది. మొత్తం 491 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ముతక ధాన్యాల ఉత్పత్తిలో 7 ఎల్ఎంటీ ల కొనుగోలు జరగడం గమనించాల్సిన అంశం. తృణధాన్యాలు, నూనె గింజల పరిస్థితీ ఇదే విధంగా ఉన్నది. 2015-16లో తృణధాన్యాల సేకరణ సున్నా శాతం. 2016-17లో అది 1 శాతంగా మాత్రమే నమోదైంది. ఇక దేశవ్యాప్త సాధారణ ఎన్నికలకు ముందు 2018-19లో ఇది అధికంగా 21 శాతానికి చేరింది. ఆ తర్వాత ఎన్నికల్లో విజయం సాధించిన మోడీ సర్కారు.. కొనుగోళ్లను తగ్గించడంతో అది కాస్తా 9.5 శాతానికి పడిపోయింది. 2015-16లో నూనెగింజల సేకరణ 0.02 శాతంగా ఉండగా, 2020-21లో అది 3.2 శాతానికి చేరింది. ఇవే కాకుండా ఇతర ధాన్యాల కొనుగోళ్ల పరిస్థితీ అలాగే ఉన్నది.
'కొనుగోళ్లను వేగవంతం చేయాలి'
కేంద్రం మొదటగా కొనుగోళ్లపై దృష్టిని సారించాలని వ్యవసాయరంగ నిపుణులు సూచించారు. సేకరణను వేగవంతం చేస్తేనే అన్నదాతలకు ఆర్థికంగా తోడ్పాటు అందుతుందని వివరించారు. అయితే, మోడీ సర్కారు పాలనలో ధాన్యం సేకరణ మందగించడం రైతులను తీవ్ర ఇబ్బందుల పాల్జేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సేకరణలో ఉన్న అనిశ్చితిని తొలగించాలనీ, రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) లభించేలా హామీ ఇస్తే వారికి ప్రయోజనం చేకూరుతుందని వ్యవసాయ రంగ నిపుణులు చెప్పారు.