Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాయంత్రం 5 గంటలకు ప్రధానితో భేటీ
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేటి నుంచి భారత్లో పర్యటించనున్నారు. భారత్, రష్యా స్నేహబంధం మరింత బలపరిచే నేపథ్యంలోనే ఆయన పర్యటన సాగనున్నట్టు తెలిస్తోంది. వార్షిక సదస్సులో భాగంగా సోమవారం ఢిల్లీకి రానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని మోడీతో పుతిన్ భేటీ అవుతారు. ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశాల గురించి చర్చించనున్నారు. ముఖ్యంగా రెండు దేశాల రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉన్నది. కాగా, భారత్, రష్యా మధ్య రక్షణ రంగంలో చిరకాల సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 200 హెలికాప్టర్ల తయారీపై ఒప్పందం కుదిరే అవకాశముంది. అదేవిధంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పలు అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. అనంతరం రాత్రి 9.30 గంటలకు పుతిన్ రష్యాకు తిరుగు పయనమవుతారు. కాగా, పుతిన్ గౌరవార్థం ప్రధాని మోడీ విందును కూడా ఇవ్వనున్నారని సమాచారం.ఇదిలావుండగా, భారత్-రష్యా మధ్య ఇప్పటికే 20 సార్లు వార్షిక సదస్సులు జరిగాయి. ప్రస్తుతం జరగనున్నది 21వది. సాధారణంగా ఈ వార్షిక సదస్సు ఒకసారి రష్యాలో జరిగితే మరోసారి భారత్లో జరగడం ఆనవాయితీగా వస్తున్నది. గతేడాది భారత్లో జరగాల్సిన ఈ సదస్సు.. కరోనా కారణంగా వాయిదాపడింది. అయితే, ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం కాస్త తగ్గడంతో వార్షిక సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ భారత్కు వస్తున్నారు. ఇటీవలే రష్యా నుంచి ఆధునిక ఏకే-203 తుపాకుల అత్యవసర కొనుగోలుకు ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. సోమవారం జరిగే సమావేశంలో పలు కీలక ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేసే అవకాశాలున్నాయి.