Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మమత బెనర్జీకి ఛత్తీస్‌గఢ్ సిఎం భగేల్ కౌంటర్
ఛత్తీస్‌గఢ్ : ప్రస్తుతం 'యుపిఎ ఉనికే లేదు' అంటూ ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ తీవ్రంగా స్పందించారు. జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆదివారం నాడు ఆయన మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తృణమూల్ కాంగ్రెస్‌ను నిలపాలని మమత బెనర్జీ అనుకుంటే సంతోషమేనని, కానీ అధికారంలో ఉన్నవాళ్లపై పోరాడటంలో ప్రధానంగా నిలుస్తారా? లేదా ప్రతిపక్షంలో ఉన్న సహచర పార్టీలపై నిందలేయడంలో ప్రధానంగా నిలుస్తారా? అనేది ఆమె తేల్చుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ లేకుండా జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి సాధ్యపడదని ఆయన తెలిపారు. బిజెపితో తృణమూల్ కాంగ్రెస్ కుమ్మక్కైందన్న సందేహం ఉందా? అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ ప్రశ్నకు మమత బెనర్జీయే వివరణ ఇవ్వాల్సివుంటుందున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమైన అనంతరమే ఆమె యుపిఎ లేదన్న వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. ప్రధానితో ఏం చర్చించారన్న సంగతి కూడా ఆమె బహిర్గతం చేయకపోవడం సందేహాలకు తావిచ్చే విషయమేనని భగేల్ తెలిపారు. గోవా వంటి రాష్ట్రాల్లో తృణమూల్ కాంగ్రెస్ కూడా బరిలో నిలపాలన్న మమత నిర్ణయంపై ఆయన స్పందిస్తూ 'ఇది చాలా స్పష్టంగా ప్రతిపక్షాలను చీల్చడం ద్వారా లబ్ది పొందాలన్న బిజెపి ఎత్తుగడ' అని ఆయన అన్నారు. 'గోవాలో వాళ్లకు (తృణమూల్ కాంగ్రెస్) ఉనికేదీ లేదు. కానీ పోటీ చేస్తామంటున్నారు. ఇదంతా దేనికి? కేవలం ప్రతిపక్ష ఓటింగ్‌ను చీల్చడం ద్వారా బిజెపికి లబ్ది చేకూర్చేందుకే' అని భగేల్ తెలిపారు.