Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 374 రోజు కొనసాగిన రైతు ఆందోళన
న్యూఢిల్లీ : తమ డిమాండ్లన్నీ పరిష్కారమయ్యేదాకా ఉద్యమాన్ని ఆపమని రైతు నేతలు స్పష్టం చేశారు. మరోవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటనపై సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) దృష్టి సారించింది. ఆందోళనను విరమించి ఇంటికి తిరిగి వెళ్లాలని రైతులకు కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రికి అనేక సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని ఎస్కేఎం గుర్తుచేసింది. నవంబర్ 21న ప్రధానమంత్రికి ఎస్కేఎం పంపిన లేఖలో అవి స్పష్టంగా పేర్కొన్నట్టు తెలిపింది. ప్రభుత్వం ఈ పెండింగ్ సమస్యలను ఐదుగురు సభ్యుల కమిటీతో చర్చించాలనీ, డిసెంబర్ 7లోపు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి మిగిలిన సమస్యలన్నింటినీ చర్చించి పరిష్కరించుకుంటుందన్న ఆశాభావాన్ని ఎస్కేఎం వ్యక్తం చేసింది.రైతులపై బనాయించిన తప్పుడు కేసుల ఉపసంహరణ, అమరవీరులకు పరిహారం కోసం హర్యానా ప్రభుత్వంతో హర్యానా ఎస్కేఎం మొదటి రౌండ్ చర్చలు పూర్తి అయ్యాయని, కొంత పురోగతి లభించిందని తెలిపింది. పంజాబ్ ప్రభుత్వం కూడా ఈ దిశగా కచ్చితమైన హామీ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలన్న ప్రభుత్వాల నిర్ణయం కోసం సంయుక్త కిసాన్ మోర్చా ఎదురుచూస్తోంది. 708 మంది అమరవీరులైన రైతులకు నష్ట పరిహారం చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని ఎస్కేఎం కోరింది. సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో ఉద్యమ సమ యంలో ప్రారంభమైన శాశ్వత శిబిరాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. వార్ధా (మహారాష్ట్ర)లో 357 రోజులు, సవారు మాధోపూర్ (రాజస్థాన్)లో 321 రోజులు, సియోని (మధ్యప్రదేశ్)లో 81 రోజులు, రేవా (మధ్యప్రదేశ్)లో 337 రోజులు పూర్తి చేసుకుంది. పంజాబ్, హర్యానా సహా రాష్ట్రాల్లో ధర్నాలు, వివిధ రాష్ట్రాల్లో రైతు సంఘాల ఉద్యమ భవిష్యత్ తీరుపై సమావేశాలు, చర్చలు సాగుతున్నాయి.కాగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం 374 రోజు కూడా కొనసాగింది.రైతు ఉద్యమ విజయం తర్వాత దేశవ్యాప్తంగా రైతు సంఘాలు విజయయాత్రలు చేపడుతున్నాయనీ, అందుకు సహకరించే సంఘాలకు సత్కారాలు చేస్తున్నట్టు తెలిపింది.సంయుక్త కిసాన్ మోర్చా తదుపరి సమావేశం డిసెంబర్ 7న జరగనుంది. ఇందులో ఉద్యమ భవిష్యత్తును నిర్ణయించనున్నట్లు ఎస్కేఎం తెలిపింది.