Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉచిత ప్రకటనలతో సిద్ధమవుతున్న వివిధ పార్టీలు
- మహిళల మద్దతు కోసం ప్రత్యేక వాగ్ధానాలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మళ్లీ ఎన్నికల హడావిడి త్వరలో మొదలుకానున్నది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2022 ప్రారంభంలో జరగబోతున్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉన్నాయి. వీరి మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఇంటి కరెంట్ ఉచితం, నీటి బిల్లులు మాఫీ, యువతకు ఉద్యోగాలిస్తాం, రుణాలిస్తాం..ఇలాంటి వాగ్ధానాలు పనిచేసే పరిస్థితి కనబడటం లేదు. దాంతో వివిధ రాజకీయ పార్టీలు మహిళా ఓటర్లను ఆకర్షించడానికి వారిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా సిద్ధమవుతున్నాయి. మహిళా ఓట్లను గణనీయంగా తమ ఖాతాలో వేసుకునే విధంగా వివిధ సంక్షేమ పథకాలు ప్రకటించే అవకాశముంది. మహిళలు తమవైపు నిలబడితే గెలుపు ఖాయమని దాదాపు అన్ని పార్టీలూ భావిస్తున్నాయి.
యూపీ గెలుపు కీలకం
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టిగా నిలబడాలంటే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే ఆధారం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్ భవిష్యత్తును నిర్దేశించబోతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్లిన ప్రతిచోటా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ మహిళలకు పెద్ద సంఖ్యలో వాగ్దానాలు చేస్తున్నారు. 40శాతం టికెట్లు మహిళా అభ్యర్థులకే ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుజేస్తామని చెబుతున్నారు.
నెలకు వెయ్యి రూపాయలు
అంతర్గత కుమ్ములాటతో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు పంజాబ్‌లో అధికారం నిలబెట్టుకోవటం పెద్ద సవాల్‌గా మారింది. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ అమలు, పెండ్లికుమార్తెకు నగదు సాయం..వంటివి కాంగ్రెస్ ప్రధానంగా ప్రచారం చేస్తోంది. మరోవైపు మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆప్ నేత కేజ్రీవాల్ చేస్తున్న వాగ్దానాలు పతాక శీర్షికన నిలుస్తున్నాయి. 18ఏండ్లు నిండిన ప్రతి మహిళకు ప్రతినెలా రూ.1000 గ్రాంట్‌గా ఇస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లో కొండ ప్రాంతంలో మహిళల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా 'సీఎం ఘసియారీ యోజన' అనే పథకాన్ని ప్రారంభించారు. పశువుల దాణా కోసం కొండ ప్రాంతాల్లో తిరగాల్సిన శ్రమను తగ్గిస్తామని, పశువుల దాణా అందజేస్తామని వాగ్దానం చేశారు.