Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంపై రాహుల్ గాంధీ ఆగ్రహం
న్యూఢిల్లీ: ఈశాన్య భారతంలోని నాగాలాండ్‌లో శనివారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. మిలిటెంట్లు అని భావించి భద్రతా బలగాలు సాధారణ పౌరులపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హౌం మంత్రిత్వ శాఖపైనా విమర్శలు గుప్పించారు. కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నదంటూ ప్రశ్నించారు. దేశంలో పౌరులకు, భద్రతా బలగాలకు రక్షణ లేదా? అంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 'ఇది హదయ విదారక ఘటన. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిజమైన సమాధానం ఇవ్వాలి. దేశంలో పౌరులు, భద్రతా సిబ్బంది సురక్షితంగా లేనప్పుడు అసలు హౌం మంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నట్టు' అంటూ ట్వీట్ చేశారు. ఇదిలావుండగా, రాష్ట్ర ప్రజలు హార్న్‌బిల్ అనే పండుగను జరుపుకొంటున్న సమయంలో మిలిటెంట్లుగా భావించిన భద్రతా బలగాలు వారిపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనపై నాగాలాండ్ సీఎం నెరుప్యూ రియో ఇప్పటికే అత్యున్నత స్థాయి సిట్ దర్యాప్తునకు ఆదేశించించారు. భద్రతా బలగాలు పౌరులు ప్రయాణిస్తున్న వాహనం పై పొరపాటున కాల్పులు జరిపారా, లేదా ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపారా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు అధికారులు. బాధిత కుటుంబాలకు న్యాయం అందేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీనిపై ఆర్మీ ఉన్నతాధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. పౌరుల ప్రణాలు పోవడంపై విచారణ వ్యక్తం చేస్తూ.. దీనికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.