Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిమాండ్లపై ఎంపీలకు వినతి పత్రాలు
- నూతన విద్యావిధానంపై తీవ్రపోరాటం : అంగన్వాడి అఖిలభారత ఫెడరేషన్ నిర్ణయం
అమరావతి : కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 23, 24 తేదీలలో జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో భాగస్వామ్యం కావాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ నిర్ణయిం చింది. విజయవాడ వేదికగా మూడు రోజుల పాటు జరిగిన జాతీయ కమిటీ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయించారు. అంగన్వాడీ వ్యవస్థను బలహీనపరచి, ఐసిడిఎస్‌ను దెబ్బతీసే కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ సమ్మెలో భాగస్వాములు కావాలని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ అండ్ హెల్పర్స్ (ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్) ప్రధాన కార్యదర్శి ఎఆర్ సింధు పిలుపునిచ్చారు. విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కృష్ణాజిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతన ఆర్థిక విధానాలు-ఐసీడీఎస్ పై ప్రభావం అంశంపై ఆదివారం జరిగిన సదస్సుకు సింధు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యావిధానం ఐసీడీఎస్ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుందని, దీని పరిరక్షణ కోసం పోరాటాలను తీవ్రతరం చేయాలని చెప్పారు. ఆరేండ్లలోపు పిల్లల సమగ్ర అభివృద్ధికి, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పోషకాహారాన్ని అందించే అంగన్వాడీ పథకాన్ని కేంద్రం ధ్వంసం చేస్తోందన్నారు. ఈ పథకం ద్వారా 10కోట్ల మంది పిల్లలు,రెండు కోట్ల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇటువంటి ప్రజాసంక్షేమ పథకాన్ని ప్రభుత్వ విభాగంగా మార్చాలని డిమాండ్ చేశారు. గత ఐదేళ్లుగా మోడీ ప్రభుత్వం అంగన్వాడీ పథకానికి బడ్జెట్ కేటాయింపులు మూడో వంతుకు కుదించివేసిందని తెలిపారు. కరోనా కాలంలో ఉపాధిలేక వేతనాలు లేక పోషకాహారలోపం మరింత పెరిగిందన్నారు. ప్రజలను ఆదుకోవాల్సిన ఇటువంటి తరుణంలో నూతన విద్యావిధానం తెచ్చి అంగన్వాడీ వ్యవస్థను దెబ్బతీయడం కేంద్రానికి తగదని వెల్లడించారు. ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలని తగిన బడ్జెట్ కేటాయింపులు ఇవ్వాలని, కనీస వేతనం రూ.26వేలు చేయాలని, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఈఎస్ఐ, పీఎఫ్, పెన్షన్ సదుపాయాలు కల్పించాలని, ఐసీడీఎస్‌ను ప్రయివేటీకరణ చేయవద్దని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో పార్లమెంట్ సభ్యులను కలిసి వినతిపత్రాలను జనవరి నెలలో అన్ని రాష్ట్రాల్లో అందిస్తామని చెప్పారు. 2022 జులై 10న అంగన్వాడీల సమస్యలు, డిమాండ్లపై ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడతాని తెలిపారు. కార్యక్రమానికి కృష్ణాజిల్లా యూనియన్ అంగన్వాడీ ప్రాజెక్టు-2 కార్యదర్శి రత్నకుమారి అధ్యక్షత వహించారు, జిల్లా ప్రధానకార్యదర్శి ఎన్‌సిహెచ్ సుప్రజ వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో యూనియన్ ఏపీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు బేబిరాణి, కె సుబ్బరావమ్మ పాల్గొన్నారు.