Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో 21కు చేరిన ఒమిక్రాన్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి చర్యలను వేగవంతం చేశాయి. దీనిలో భాగంగా మాస్కులు ధరించడం తప్పని సరితో పాటు కరోనా మార్గదర్శకాలు పాటించకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నాయి. ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రభుత్వం కోవిడ్-19 టీకాలు తీసుకోవడాన్ని తప్పనిసరి చేసింది. ఒమిక్రాన్ భయాందోళనల మధ్య వందశాతం టీకా లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నది. టీకా తీసుకోకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సేవల డైరెక్టర్ బి. శ్రీరాములు ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం ఆదేశాలు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. తప్పనిసరిగా టీకాలను వేసే లక్ష్యంతో పుదుచ్చేరి ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ యాక్ట్ 1973లోని నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది.
దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్
దేశంలో ఒమిక్రాన్ కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆదివారం కొత్తగా దేశరాజధాని ఢిల్లీలో ఒక ఒమిక్రాన్ కేసు నమోదైంది. అలాగే, మహారాష్ట్రలో 7 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 21కు చేరుకున్నాయి. ఇదివరకు కర్నాటకలో రెండు, గుజరాత్ ఒకటి, మహారాష్ట్రలో ఒకటి కేసులు నమోదయ్యాయి.