Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరైన విధానంలో మాస్క్‌లు ధరిస్తున్నవారు కేవలం 2శాతమే
- బయటకు వెళ్తున్నా..మాస్క్ ఉండటం లేదు : లోకల్ సర్కిల్స్ సర్వే
న్యూఢిల్లీ : కరోనా రెండో వేవ్ దేశాన్ని ఎంతగా వణికించిందో అందరూ మర్చిపోయారు. మాస్క్‌లు ధరించకుండా బయట తిరుగుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం దేశంలో కేవలం 2శాతం మంది మాత్రమే మాస్కులు ధరిస్తున్నారని 'లోకల్ సర్కిల్స్' అనే సామాజిక సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇంటి నుంచి బయటకు వెళ్తున్న ప్రతి ముగ్గురులో ఒకరు మాస్కు ధరించటం లేదని సర్వే తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే మాస్క్ పెట్టుకునేవారి సంఖ్య సెప్టెంబర్‌లో 29శాతం పడిపోయిందని పేర్కొన్నది. కరోనా వైరస్లలో అత్యంత ఎక్కువగా వ్యాప్తిచెందే లక్షణమున్న ఒమిక్రాన్ వైరస్ బయటపడినవేళ ఈ సర్వే నిర్వహించారు. దేశవ్యాప్తంగా 364జిల్లాల్లో 25వేల మంది నుంచి వివరాలు సేకరించారు. ''మీ ప్రాంతంలో బయట తిరుగుతున్నవారిలో ఎంతమంది మాస్క్‌లు పెట్టుకుంటున్నారు?'' అని ప్రశ్నించారు.ఈనేపథ్యంలో వచ్చిన సమాధానాల్ని క్రోడీకరించగా, వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సరైన పద్ధతిలో మాస్క్‌లు ధరిస్తున్నారు కేవలం 2శాతం మందే ఉన్నారు. ఎక్కడా ఎవరూ మాస్క్‌లు పెట్టుకోవటం లేదని సర్వేలో పాల్గొన్న 8శాతం మంది చెప్పారు. దేశంలో ఒమిక్రాన్ నాలుగో కేసు నమోదైన వేళ ఈ సర్వే జరిగింది. ఇంటి నుంచి బయటకు వెళ్తున్న ప్రతి ముగ్గురిలో ఒకరు మాస్క్‌లు ధరించటం లేదు. 5శాతం మంది మాస్క్‌ల్ని సరిగ్గా ధరిస్తున్నారు. సరిగా ధరించనివారు 38శాతం మంది ఉన్నారు. ఏ తరహా మాస్క్‌లు ధరిస్తున్నారన్న ప్రశ్నకు, 63శాతం మంది బట్టతో చేసిన మాస్క్‌లు ధరిస్తున్నామని చెప్పారు. 21శాతం మంది ఒకసారి వాడిపడేసేవి, ఎన్-95 మాస్క్‌లు 8శాతం మంది, కెఎన్-95, డబ్ల్యూ-95 తరహా మాస్క్‌ల్ని 3శాతం మంది వాడుతున్నారని తేలింది.