Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమావేశాలు నిర్వహించే తీరు ఇలాగేనా..?
- ఏకపక్షంగా ప్రతిపక్ష ఎంపీలపై వేటు
- విపక్షం గొంతు నొక్కితే..వాటిని చర్చలంటారా? : విశ్లేషకులు
చట్టసభలు జరుగుతున్న తీరుపై సర్వత్రా ఆందోళనవ్యక్తమవుతున్నది. అటు రాజకీయ పరిశీలకులు, ఇటు ప్రజలు కూడా అధ్యక్షా..ఇదేనా సమావేశాలు నిర్వహించే తీరు అన్న చర్చ నడుస్తున్నది. లోక్‌సభలో మందబలం ఉండటంతో..బీజేపీ తమకు అవసరమైన బిల్లులకు ఆమోదముద్రవేయించుకుంటున్నది. రాజ్యసభలో మెజార్టీ లేకపోవటంతో..ప్రతిపక్ష పార్టీల ఎంపీలను టార్గెట్ చేస్తున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్లమెంటు ఉభయసభల్లోనూ ప్రతిపక్ష సభ్యులు చర్చకు అనుమతించాలని కోరుతున్నా అటు లోక్‌సభలో కానీ, ఇటు రాజ్యసభలో కానీ ఎవరూ పట్టించుకోవటంలేదు. పైగా విపక్షపార్టీలకు చెందిన ఎంపీలకు ప్రతిగా ఆందోళనలకు దిగటం..లేనిపక్షంలో అధికారపక్షమైన బీజేపీ వారితో వాగ్వివాదానికి రెడీ అయిపోతున్నది. సభ జరగకుండా ప్రతిపక్ష ఎంపీలు అడ్డుకుంటున్నారనే విధంగా తమ తప్పిదాలను కప్పిపుచ్చుకుంటున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల తీరు చూస్తుంటే..కోట్లాది ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఒక్క రోజులోనే అనేకమార్లు పార్లమెంట్లో ఇరు సభలు వాయిదా పడుతున్నాయి. నిరంతరం లోక్‌సభ, రాజ్యసభ వాయిదా పడటం సర్వసాధారణంగా మారుతోంది. 12 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన మోడీ సర్కా ర్, ఒక విధంగా సమావేశాల ప్రారంభంలోనే ప్రతిపక్షాల్ని రెచ్చగొట్టింది. వర్షాకాల సమావేశాల్లో (ఆగస్టు 11న) రాజ్యసభలో చోటుచేసుకున్న పరిణామాలపై సభాపతి వెంకయ్యనాయుడు ఈ చర్యలకు ఉపక్రమించారు. ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేసే తీర్మానాన్ని పార్లమెంట్ సంబంధాల మంత్రి ప్రహ్లాద్ జోషీ సభలో ప్రవేశపెట్టడం, ఏకపక్షంగా దానిని మూజువాణీ ఓటుతో ఆమోదించటం క్షణాల్లో జరిగిపోయాయి.
నియమావళిని అతిక్రమిస్తే ...
''సభా సాంప్రదాయాల్ని, నియమావళిని అతిక్రమించిన సభ్యుల్ని శిక్షించవచ్చు. అయితే దానికి ఒక పద్ధతి ఉన్నది. ఎంపీలను సస్పెండ్ చేసే అధికారం సభకు ఉన్నది. సభను నడిపే చైర్మెన్‌కు మాత్రం లేదు. ఒకవేళ శిక్షించాలనుకుంటే సభ్యుల సస్పెన్షన్ అంశంపై చర్చ జరగాలి. ఇక్కడా సహజ న్యాయసూత్రాలు వర్తిస్తాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి వాదనను వినకుండా శిక్షించే హక్కు ఎవ్వరికీ లేదు. సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో ఒకరైన శివసేన మహిళా ఎంపీ ప్రియాంకా చతుర్వేదీని ఆనాడు (ఆగస్టు 11న) సభలో పురుష మార్షల్స్ అడ్డుకోవడమేకాదు, దాడికి సైతం దిగారు.
ఈ సంగతి సీసీటీవీ కెమెరాల్లోనూ రికార్డైంది. ఈ వీడియో ఫుటేజీని పరిశీలించకుండా తనపై సస్పెన్షన్ ఎలా విధిస్తారని ప్రియాంకా చతుర్వేది మోడీ సర్కార్‌ను ప్రశ్నించింది. తన వాదన సభ వినకుండా తనపై చర్య తీసుకోవటమేంటని ఆమె నిరసన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఘటనలను పరిగణనలోకి తీసుకుని ఆ పన్నెండుమంది ఎంపీలను సస్పెండ్ చేశామని బీజేపీ చెబుతున్నా.. అపుడు రాజ్యసభలో జరిగిన ఘటనకు ఏమాత్రం సంబంధం లేని సీపీఐ(ఎం)ఎంపీ ఎలమారం కరీంపై సస్పెన్షన్ విధించటం గమనార్హం.
పార్లమెంట్లో సైనిక పాలన!
వర్షాకాల సమావేశాల సమయం లో ప్రతిపక్ష సభ్యుల్ని అడ్డుకోవడా నికి, నియంత్రించడానికి పార్లమెంట్ భద్రతా బలగాల్ని కాకుండా, బయ ట నుంచి వేరేవారిని తీసుకొచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మోడీ సర్కార్ ఏర్పాటుచేసిన భద్రతా బలగాలు మహిళా ఎంపీలపై చేయిచేసుకున్నాయని తెలిసింది. ఓవైపు సభలో ప్రతిపక్ష సభ్యులపై దాడు జరుగుతుండగానే, మరోవైపు జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. ఇంతకు ముందు ఎన్నడూ చూడనటువంటి పరిస్థితి ఆరోజు (ఆగస్టు 11న) సభలో నెలకొందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వివాదాస్పద సాగు చట్టాల్ని కూడా ఇదే విధంగా కేంద్రం ఆమోదింపజేసుకుంది. ఏకపక్షంగా చట్టాల్ని చేసింది. పార్లమెంట్ అస్థిత్వానికే ఇది ప్రమాదం.
- కేంద్ర మాజీ సమాచార కమిషనర్ (సీఐసీ) ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్