Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్రమైన కష్టాల్లో ప్రజలు
- అత్యంత కఠిన సమయం : నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ
న్యూఢిల్లీ : భారతదేశంలో ప్రజలు తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయారని, చిన్న చిన్న ఆశలు, ఆకాంక్షలు సైతం నెరవేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారని నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ అన్నారు. భారత ఆర్థిక పరిస్థితి 2019తో పోల్చితే దయనీయంగా ఉందని అన్నారు. విద్యార్థులపై సహజంగా తల్లిదండ్రులు, సమాజం ఒత్తిడి ఉంటుందని, దానివల్ల ఏదోఒకటి ఎంచుకోకూడదని చెప్పారు. జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారో, దానికి అనుగుణంగా కెరీర్ను ఎంచుకోవాలని, ధైర్యంగా ముందుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు. అహ్మదాబాద్ యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా శనివారం విద్యార్థులను ఉద్దేశించి అభిజిత్ బెనర్జీ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ''సమాజానికి తిరిగి ఇవ్వగల శక్తి ఒక్క విద్యార్థులకు మాత్రమే ఉంది. సమాజానికి నేడు ఆ అవసరం కూడా ఉంది. అంతేకాదు ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. పశ్చిమబెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లో నేను కొన్ని రోజులు గడిపివచ్చాను. ప్రజల ఆశలు, ఆకాంక్షలు మరింత చిన్నవిగా మారిపోతున్నాయి. బహుశా ప్రజలు తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉండటమే కారణం కావొచ్చు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను 2019తో పోల్చితే..ఇంకా కోలుకోలేదనే చెప్పాలి. ఆర్థికంగా చాలా కిందకు వెళ్లిపోయాం. దీనికి నేను ఎవర్నో నిందించటం లేదు.'' అని అన్నారు.
ఒత్తిడికి లొంగరాదు..
తల్లిదండ్రులు, సమాజం నుంచి వచ్చే ఒత్తిడికి తలొగ్గి..ఏదో ఒక కెరీర్ను విద్యార్థులు ఎంచుకోరాదు. జీవితంలో ఏం చేయాలనుకుంటారో..దానిని ధైర్యంగా చేయాలి. జేఎన్యూలో చదువుకుంటున్న సమయంలో విద్యార్థుల నిరసనలో పాల్గొన్నాను. పోలీసులు అరెస్టు చేసి తీహార్ జైలుకు తీసుకెళ్లారు. అక్కడ 10రోజులు ఉంచారు. అయ్యో ఇలా జరిగిందేంటి? అని భయపడలేదు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం హార్వార్డ్ వెళ్లాను.