Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగాలాండ్‌లో ఘాతుకం.. భద్రతా సిబ్బంది ఆపరేషన్‌లో అమాయకులు బలి
- స్థానికుల ఆగ్రహం, ఒక జవాను మృతి
గౌహతి/న్యూఢిల్లీ : సాధారణ పౌరులను ఉగ్రవాదులు గా భావించి భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించిన విషాదం నాగాలాండ్‌లో శనివారం రాత్రి సంభవించింది. భద్రతా సిబ్బంది కాల్పుల్లో 11 మంది గాయపడ్డారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ దారుణంతో ఆగ్రహం చెందిన స్థానికులు చేసిన దాడిలో ఒక భద్రతా సిబ్బంది మృతిచెందాడు. మాన్ జిల్లాలోని తిరు ప్రాంతం వద్ద ఈ దారుణం జరిగింది. తిరు ప్రాంతానికి 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఒక బొగ్గు గని నుంచి కార్మికులు తిరిగివస్తుండగా వారి పికప్ వ్యాన్‌పై భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. సంఘటనా స్థలంలోనే ఆరుగురు మరణించగా, తరువాత ఏడు మంది మరణించారు. మరో 11మంది గాయపడ్డారు. ఇద్దరి ఆచూకీ లభించడం లేదు. బొగ్గు గనిలో వారమంతా పని చేసి కార్మికులు తమ కుటుంబ సభ్యులతో గడపడానికి శనివారం సాయంత్రం పని ప్రదేశం నుంచి బయలుదేరుతారు.ఆదివారం కుటుంబ సభ్యులతో గడిపి,సోమవారం మళ్లీ విధులకు హజరువుతారు. సుదీర్ఘకాలం గా ఇది క్రమంతప్పకుండా జరుగుతోంది. అయితే ఈ శనివారం మాత్రం కార్మికులను మృత్యువు వెంటాడింది. ఈ కాల్పుల ఘటన తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. భద్రతా సిబ్బందికి చెందిన రెండు వాహనాలు దహనం చేశారు. ఈ క్రమంలో ఒక భద్రతా సిబ్బంది మరణించాడు.ఈ ఘటనపై డింపూర్కు సమీపంలో ఉన్న ఆర్మీ 3 కార్ప్స్ హెడ్‌క్వార్టర్ ఆదివారం స్పందించింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఘటనపై సరైన చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చింది. 'ఉగ్రవాదుల గురించి విశ్వసనీమైన సమాచారంతోనే తిరు ప్రాంతంలో ఆపరేషన్‌కు ప్రణాళిక రచించబడింది. అయితే ఈ సంఘటన, దీని అనంతర పరిణామాలకు తీవ్రం విచారం వ్యక్తం చేస్తున్నాం' అని ప్రకటనలో తెలిపింది. 'దురదృష్టవశాత్తు జరిగిన ప్రాణనష్టానికి గల కారణాన్ని ఉన్నతస్థాయిలో పరిశోధన చేస్తున్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి' అని ప్రకటనలో వెల్లడించింది. స్థానికులు దాడిలో కొందరు సైనికులు గాయపడ్డారని, గాయాలతో ఒక సైనికుడు మరణించాడని ప్రకటనలో తెలిపింది.మరోవైపు నాగాలాండ్ ప్రభుత్వం కూడా ఈ సంఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. నిషేధిత నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఖల్పంగ్-యుంగ్ అంగ్) సభ్యుల కోసం ఎదురుచూస్తున్న భద్రతా సిబ్బంది దురదృష్టవశాత్తు కార్మికుల పికప్వ్యాప్పై కాల్పులు జరిపారని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరణించిన మృతుల కుటుంబ సభ్యులకు నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫియు రియో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. 'సాధారణ పౌరులు మరణించిన సంఘటన దురదృష్టకరం. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. గాయపడ్డిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఉన్నత స్థాయి విచారణ జరిపి చట్ట ప్రకారం న్యాయం చేస్తాం. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం' అని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.