Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ సృష్టికర్త హెచ్చరిక
న్యూఢిల్లీ: ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 కన్నా భవిష్యత్తులో వచ్చే మహమ్మారులు మరింత ప్రాణాంతకంగా ఉంటాయని ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సృష్టికర్తలలో ఒకరైన ప్రొఫెసర్ డేమ్ సారా గిల్బర్ట్ హెచ్చరించారు. కరోనా వైరస్ నుంచి నేర్చుకున్న పాఠాలను మర్చిపోకూడదనీ, తదుపరి వైరస్‌లను (మహమ్మారులు) ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ప్రపంచం నిర్థారించుకోవాలన్నారు. సోమవారం బ్రిటన్‌లో జరిగిన 44వ రిచర్డ్ డింబ్లేబీ లెక్చర్ సదస్సులో పాల్గొన్న సారా గిల్బర్ట్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అలాగే, ''భవిష్యత్తులో వచ్చే వైరస్లు మరింత విధ్వంసకరంగా ఉండవచ్చు. అది మరింత అంటువ్యాధి కావచ్చు, లేదా మరింత ప్రాణాంతకం కావచ్చు లేదా రెండూ కావచ్చు. మన జీవితాలను, మన జీవనోపాధికి ముప్పు కలిగించే వైరస్ ఇదే చివరిది కాదు. తదుపరి వైరస్‌లను ఎదర్కొనేందుకు ప్రపంచం మెరుగ్గా సిద్ధంగా ఉందని నిర్ధారించుకోవాలి. వైరస్‌లపై పోరాటంలో ఎంతో ప్రగతి సాధించాం. ఆ జ్ఞనాన్ని వదలుకోవద్దు. మహమ్మారులను ఎదుర్కొనేందుకు మరింత అధికంగా ఫండింగ్ అవసరం''అని అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ గురించి మాట్లాడుతూ.. ''ఒమిక్రాన్ వేరియంట్ స్పైక్ ప్రొటీన్‌లో వైరస్ వ్యాప్తిని పెంచే ఉత్పరివర్తనలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతమున్న కరోనా వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియంట్‌పై తక్కువ ప్రభావం చూపే అవకాశాలున్నాయి. దీని గురించి మరింత తెలిసే వరకు, జాగ్రత్తగా ఉండాలి'' అని అన్నారు.