Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్'లో అధిక భాగం ఆపార్టీకే
- మొత్తం రూ.245కోట్లలో బీజేపీకి రూ.209 కోట్ల విరాళాలు
న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ధనికులు, బడా కార్పొరేట్ల నుంచి బీజేపీకి భారీ ఎత్తున ఎన్నికల విరాళాలు అందుతున్నాయి. అతిపెద్ద ఎన్నికల ట్రస్ట్‌ల్లో ఒకటైన 'ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్' విరాళాల్లో అత్యధిక భాగం బీజేపీకి వెళ్లాయి. వివిధ రాజకీయ పార్టీలకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన విరాళాల సమాచారాన్ని ఆ ట్రస్ట్ ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఈ సమాచారం ప్రకారం, ఆయా రాజకీయ పార్టీలకు మొత్తం రూ.245.7కోట్ల విరాళాలు అందజేసింది. ఇందులో ఒక్క బీజేపీ పార్టీకే రూ.209కోట్లు అందాయి. ఆ పార్టీకి దక్కిన విరాళాలు క్రితం ఏడాది (2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.203కోట్లు)తో పోల్చితే రెండు శాతం(రూ.209కోట్లు) పెరిగాయి. మొత్తం విరాళాల్లో 84శాతం ఒక్క బీజేపీకే వెళ్లినట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ప్రుడెంట్ ట్రస్ట్ 2013-14 నుంచి బీజేపీకి భారీ మొత్తంలో ఎన్నికల విరాళాలు అందజేస్తోంది.
ఇక ఇతర రాజకీయ పార్టీల విషయానికొస్తే, క్రితం ఏడాదితో పోల్చితే కాంగ్రెస్‌కు వెళ్లిన విరాళాలు 93శాతం తగ్గాయి. గతంలో రూ.31కోట్లు విరాళాలు అందగా, 2020-21లో కేవలం రూ.2కోట్లు విరాళాలు వచ్చాయి. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి అంత క్రితం ఏడాది రూ.11.2కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.1.7కోట్లు అందాయి. బీజేపీ తర్వాత అత్యధికంగా జనతాదళ్ (యునైటెడ్)కు రూ.25కోట్లు అందాయి. ఎన్సీపీకి రూ.5కోట్లు, ఆర్జేడీకి రూ.2కోట్లు ఎన్నికల విరాళం అందింది. దేశంలో బడా కార్పొరేట్లు ఇచ్చే డొనేషన్లలో అత్యధికం ప్రుడెంట్ ట్రస్ట్‌కే వెళ్తాయని విశ్వసనీయ సమాచారం.
ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సర్వీసెస్, మేఘా ఇంజనీరింగ్, భారతీ ఎయిర్టెల్, భారతీ ఇఫ్రా, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్, హల్దియా ఎనెర్జీ..తదితర సంస్థలు ఈ ట్రస్ట్‌కు పెద్దమొత్తంలో డొనేషన్లు ఇచ్చాయి. దేశంలో బడా కార్పొరేట్ల నుంచి అందుతున్న డొనేషన్లు ఎన్నికల ట్రస్ట్‌ల ద్వారా వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలుగా అందుతున్నాయి. అందులో అతిపెద్ద ట్రస్ట్ అయిన 'ప్రుడెంట్' నుంచి 2016-18 మధ్య బీజేపీకి రూ.405కోట్లు అందాయని 'అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రీఫార్మ్స్'(ఏడీఆర్) తెలిపింది. అత్యంత ధనికులు, బడా కార్పొరేట్ల బీజేపీకి ఇస్తున్న విరాళాలు ప్రతిఏటా పెరుగుతున్నాయని ఏడీఆర్ పేర్కొన్నది.