Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానాలో ఆరోగ్యమంత్రి ఇంటి వద్ద ఆశా వర్కర్ల నిరసన
- డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆందోళన
అంబాలా : కరోనా యోధులంటే బీజేపీ పాలకులకు ఎందుకంత నిర్లక్ష్యమంటూ ఆశావర్కర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. హర్యానా హౌం,ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ ఇంటివద్ద ఆందోళనకు దిగారు.తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆశాలు మరోసారి వీధుల్లోకి వచ్చారు. హర్యానాలోని పలు నగరాల నుంచి కదం తొక్కారు. అంబాలా కాంట్ శాస్త్రి కాలనీ వెలుపల పెద్ద ఎత్తున ప్రదర్శన చేసి, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీత మాట్లాడుతూ ఆశా వర్కర్లు కరోనా యోధులుగా పనిచేశారన్నారు. రూ.1500 గౌరవ వేతనం ఇవ్వాలంటూ ప్రతిపాదించిన రెండు ఫైళ్లను ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రద్దు చేశారని ఆరోపించారు. ఆ ఫైళ్లు రద్దవటంతో..ఆశాలు నిరాశలో ఉన్నారని చెప్పారు. రద్దు చేసిన ఆ ఫైళ్లను మళ్లీ ప్రక్రియలో తేవాలంటూ ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖట్టర్ సర్కార్ తగిన రీతిలో స్పందించకపోతే..ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ప్రభుత్వం ఏడవ వేతన సంఘం సిఫారసులను అమలు చేయటం అభినందనీయమనీ, అయితే ఆశా వర్కర్లను పట్టించుకోలేదన్నారు.. ఆరోగ్య శాఖకు వెన్నెముకలా పనిచేస్తూ..ప్రభుత్వ పథకాలను ఆశాలే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని వివరించారు.కరోనా కాలంలో తమ ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేశారన్నారని తెలిపారు. కరోనా సోకిన రోగులను గుర్తించడం,వారిని వేరు చేయడంతో పాటు మందుల పంపిణీలోనూ కీలకపాత్ర పోషించారని అన్నారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రచారంలో కూడా ఆశా వర్కర్ల సహకారం ప్రశంసనీయమన్నారు.ఆశా వర్కర్లు భారీగా తరలిరావటంతో.. పోలీసు బలగాలను మోహరించారు.