Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ప్రియాంక చోప్రా, సోనియాల పేర్లు
- విచారణకు ఆదేశించిన జిల్లా మెజిస్ట్రేట్
- వాస్తవాలు దాస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం.. బీహార్ సర్కారుపై విమర్శలు
పాట్నా : కరోనా కేసులు, మరణాలు, వైద్య సౌకర్యాలకు సంబంధించి సరైన డేటాను వెల్లడించకుండా దాస్తున్నదని బీహార్లోని సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వంపై ఆరోపణలున్నాయి. నిజమైన సమాచారాన్ని దాస్తున్నదని పలు సర్వేలు సైతం తేల్చాయి. న్యాయస్థానం మొట్టికాయలతో పలుమార్లు కరోనా డేటాను నితీష్ ప్రభుత్వం సవరించింది. తాజాగా టీకాలకు సంబంధించి దారుణ విషయం వెలుగులోకి రావడంతో వ్యాక్సినేషన్ డేటాపైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీహార్ ప్రభుత్వం గత వారం 8 కోట్ల మందికి టీకాలు వేసినట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ఓ ఆరోగ్య కేంద్రంలో రెండు డోసులు తీసుకున్నవారి జాబితాను గమనిస్తే.. ఆ జాబితాలో ప్రధాని మోడీ, అమిత్ షా, ప్రియాంక చోప్రా, సోనియాల పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన జాబితా వైరల్గా మారింది. ఇప్పటివరకు కరోనా సమాచారం దాచిన నితీష్ ప్రభుత్వం.. టీకాల విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించి.. తప్పుడు సమాచారం అందిస్తున్నదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చనిపోయిన వ్యక్తులకు సైతం రెండు డోసులు ఇచ్చినట్టుగా ఈ జాబితాలో పేర్కొన్నారు. అర్వాల్ జిల్లాలోని కర్పిలోని అదనపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు చనిపోయిన వ్యక్తులకు రెండు డోసుల ఇచ్చినట్టుగా పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లను జిల్లా ఆరోగ్య శాఖ తొలగించింది. అయితే, టీకాలు తీసుకున్నవారి సంఖ్యను అధికంగా చూపించడానికి పోర్టల్లో తప్పుడు పేర్లను నమోదుచేయమని హెల్త్ మేనేజర్ బలవంతం చేశారని డేటా ఆపరేటర్లు ఆరోపిస్తున్నారు. ''వ్యాక్సినేషన్ పొందిన వారి నిజమైన డేటాను అందించకుండా పేర్లను నమోదు చేయమని హెల్త్ మేనేజర్ నాపై ఒత్తిడి చేశారు'' అని సహర్ టెల్పాలోని ఏపీహెచ్సీలోని ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లలో ఒకరైన వినరు కుమార్ మీడియాతో అన్నారు. తమకు ఏం పేర్లు ఇచ్చిన నమోదుచేయమని ఒత్తిడి చేసిన అధికారులు.. నిజాలు బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని బలిపశువులను చేస్తూ.. ఉద్యోగం నుంచి తొలగించారని మరో ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్ ఆరోగ్య మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు మంగళ్ పాండే గతవారం రాష్ట్రం రాష్ట్రం 8 కోట్ల వ్యాక్సినేషన్ మైలురాయిని దాటిందని పేర్కొన్నారు. ఆ తర్వాత జాబితాను గమనిస్తే.. మోడీ, షా, ప్రియాంక వంటి వారి పేర్లు బయట పడ్డాయి. రెండు నెలల కంటే ముందే టీకా లక్ష్యాన్ని అందుకున్నామని మంత్రి చేసిన ప్రకటనపై ఇప్పులు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతవారం పాట్నాలోనూ మొదటి డోసు తీసుకున్నవారి పేర్లు సైతం రెండు డోసులు తీసుకున్న వారి జాబితాలో చేర్చారనీ, పోర్టల్లోనూ అప్లోడ్ చేశారని పలువురు ఫిర్యాదు చేశారు. అలాగే, చనిపోయిన వారికి టీకాలు అందించినట్టుగా వారి కుటుంబ సభ్యుల ఫోన్లకు మెసేజ్లు సైతం అందాయి. దీనిపై విచారణ జరుపుతున్నట్టు ఇదివరకు అధికారులు ప్రకటించారు. అయితే, మొత్తం కరోనాకు సంబంధించిన డేటా విషయంలో వాస్తువాలను దాస్తూ.. బీహార్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.