Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగాలాండ్‌లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు
- సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్
కోహిమా: ఈశాన్య భారత రాష్ట్రమైన నాగాలండ్‌లో మిలిటెంట్లుగా భావించి సాధారణ పౌరులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపిన ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మోన్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. పార్లమెంట్‌లోనూ నాగాలాండ్ కాల్పుల ఘటనపై ఆందోళనకు దిగాయి. ఈ ఘటన చోటుచేసుకున్న మోన్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు ఈ ఘటనను ఖండిస్తూ.. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుండగా, ఉద్రిక్త పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకంటూ ఆంక్షలు విధించారు. నిరసనలు, ఆందోళనలు చేయాకుండా నిషేధాజ్ఞలతో పాటు ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేశారు. అయినప్పటికీ ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఫ్లకార్డు ప్రదర్శిస్తున్నారు. మోన్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 'వురువాంట్ జస్టిస్' అంటూ రాసిన ఫ్లకార్డులు వెలిశాయి. భాదిత కుటుంబాలకు న్యాయం చేయాలని చాలా చోట్ల సైన్ బోర్డులు ఉంచారు. అలాగే, సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్లకార్డులు ప్రదర్శించారు. ఈశాన్య రాష్ట్రాల్లో మిలిటెంట్ల కార్యకలాపాను నిరోధించడానికి భద్రతా బలగాలకు ప్రత్యేక అధికారాలు కల్పించే చట్టం ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఈ చట్టం అక్కడి సైన్యానికి విస్తృత అధికారాలు కల్పిస్తుంది. ఇది దుర్వినియోగం అవుతున్నదనీ, దీని కారణంగా చాలా సంవత్సరాల నుంచి ప్రజలు ఇబ్బందులు పడటంతో పాటు అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు, వివాదాలు ఉన్నాయి. ఈ చట్టాన్ని రద్దు చేయాలాని కొన్నేండ్లుగా డిమాండ్ ఉంది. ప్రస్తుతం చోటుచేసుకున్న మోన్ జిల్లా ఘటనతో మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ చట్టాన్ని ఉపయోగించుకుని ఈశన్య భారతంలో ప్రజలను భద్రతా బలగాలు అణచివేస్తున్నాయనీ, అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయనీ, దినిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పౌరుల హత్యలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. పౌరుల అంత్యక్రియల్లో భారీగా ప్రజలు పాలుపంచుకున్నారు. భద్రతా బలగాల చేతిలో మరణించిన పౌరులకు సంఘీభావంగా హార్న్‌బిల్ పండుగ వేదికపై నల్ల జెండాను ఎగురవేశారు. అలాగే, మణిపూర్‌లోని నాగాలు నివసించే ప్రాంతాలు సోమవారం మధ్యాహ్నం వరకు ఆరు గంటల పాటు శాంతియుతంగా బంద్ పాటించారు. పౌరుల మృతికి పట్ల మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ సంతాపం తెలిపారు. నాగాలాండ్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఏఎఫ్ఎస్పీఏ చట్టం వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతింటోందనీ, నాగాలాండ్‌లో దీనిని తొలగించాలని ఆ రాష్ట్ర సీఎం నిఫియు రియో డిమాండ్ చేశారు. అలాగే ఇతర ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ చట్టం రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మేఘాలయ సీఎం సంగ్మా కూడా ఏఎఫ్ఎస్పీఏను రద్దు చేయాలంటూ ట్వీట్ చేశారు. పౌర సంఘాలు, ఈశాన్య ప్రజలు ఈ చట్టం రద్దు చేయాలని చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు.