Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ అనుకూల విధానాలతో మోడీ సర్కార్
- ఆర్థికరంగమే కాదు.. ప్రజాస్వామ్యమూ దెబ్బతిన్నది
- ఫిబ్రవరి 23, 24న దేశవ్యాప్త సమ్మెకు పిలుపు
- బ్యాంక్, విద్యుత్ సమ్మెలకు పూర్తిమద్దతు : కార్మిక సంఘాలు
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ విధానాలు, పాలన దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని చిన్నాభిన్నం చేశా యని కార్మికసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23, 24 దేశవ్యాప్త సమ్మె చేపట్టబోతున్నామని కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక ప్రకటించింది. ''పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో రెండు రోజులపాటు దేశవ్యాప్త సమ్మె చేపట్టాలని నిర్ణయించాం. డిసెంబర్ 3న జరిగిన సమావేశంలో కేంద్ర కార్మిక సంఘాలు, ఆల్ ఇండియా ఫెడరేషన్స్, వాటి అనుబంధ సంఘాలు తీర్మానిం చాయి. ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ సర్కార్ పాలనను నిరసిస్తూ కార్మిక సంఘాలు ఈ సమ్మెకు దిగుతున్నాయి''అని సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో కార్మికసంఘాల సంయుక్త వేదిక తెలిపింది. అలాగే ఈనెల 16, 17 రెండు రోజులపాటు జరిగే బ్యాంకుల సమ్మెకు, వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న జరిగే విద్యుత్ ఉద్యోగుల సమ్మెకు మద్దతు ప్రకటించింది.
''మోడీ సర్కార్ పాలన, ఆర్థిక విధానాలు దేశానికి ఎంతగానో చేటు చేస్తున్నాయి. పౌరుల హక్కులు, జీవనో పాధితోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్యం కోసమూ పోరాడాల్సిన సమయం వచ్చింది. మోడీ సర్కార్ ఎంచుకున్న కార్పొరేట్ అనుకూల విధానాలు దేశానికి తీరని హాని చేస్తున్నాయి. దేశీయంగా, అంత ర్జాతీయంగా మోడీ సర్కార్ విధానాలు దారుణంగా విఫలమయ్యాయి. ఈనేపథ్యంలో దేశాన్ని, దేశ ప్రజల్ని కాపాడుకోవటం కోసం కార్మికసంఘాలు ఈ సమ్మెకు దిగుతున్నాయి'' అని సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీ యూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యూ ఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ మొదలైన కేంద్ర కార్మిక సంఘాలు ఒక సంయుక్త వేదికగా ఏర్పడి దేశవ్యాప్త సమ్మె చేపట్టబోతున్నాయి. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సమ్మెకు పిలుపునిచ్చిన బ్యాంకు, విద్యుత్ సంఘాల నిర్ణయాన్ని కార్మిక సంఘాల సంయుక్త వేదిక ఆహ్వానించింది. వారు చేపడుతున్న దేశవ్యాప్త సమ్మెకు మద్దతు ప్రకటించింది. ఈ దేశంలో పనిచేసే హక్కు, జీవించే హక్కును పరిరక్షించాలని, అందరికీ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం..వంటివి అమలుజేయాలని వివిధ రాజకీయ పార్టీలను కార్మికసంఘాలు కోరాయి. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతుల డిమాండ్లు నెరవేర్చాలని, ఎన్ఎంపీ పేరుతో చేపట్టిన ప్రయివేటీకరణను వెంటనే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. కాంట్రాక్ట్, స్కీం వర్కర్ల ఉద్యోగాల్ని రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందజేయాలని కోరుతున్నాయి. పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తేవాలని డిమాండ్ చేస్తున్నాయి.