Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీల సస్పెన్షన్‌పైనా ఆందోళన
- వాయిదాల పర్వం తొక్కిన రాజ్యసభ
- నాగాలాండ్ బాధితులకు పరిహారమివ్వాలి
- దీనిపై సమగ్ర విచారణ జరపాలి : ప్రతిపక్షాల డిమాండ్
- లోక్‌సభలో ప్రతిపక్షాల వాకౌట్
- సంసద్ టీవీకి శశి థరూర్ రాజీనామా
న్యూఢిల్లీ : నాగాలాండ్ హత్యల ఘటన పార్లమెంట్‌ను కుదిపేసింది. పార్లమెంట్ ఉభయసభల్లో ఇదే అంశంపై తక్షణమే ప్రభుత్వం ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల డిమాండ్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఉభయ సభల్లో ప్రకటనచేశారు. ప్రకటనపై సంతృప్తిచెందని ప్రతిపక్షాలు లోక్‌సభలో వాకౌట్ చేశాయి. తొలుత రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నాగాలాండ్ హత్యల ఘటన అంశాన్ని లేవనెత్తారు. ఇవి ఎందుకు జరిగాయో ఉభయ సభల ముందు కేంద్ర హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 'ఇది చాలా సున్నితమైన సంఘటన. ఇది జరగకూడదు. అలా ఎందుకు జరిగిందో ఆయనే సమాధానం చెప్పాలి' అన్నారు. దీనిపై స్పందించిన చైర్మెన్ వెంకయ్యనాయుడు 'ఇది తీవ్రమైన, దురదృష్టకరమైన అంశం. దీనిపై ప్రభుత్వం ప్రకటన చేస్తుంది' అని తెలిపారు. అధికార పార్టీనేత పియూష్ గోయల్ 'ఇది తీవ్రమైన అంశం. కేంద్ర మంత్రి దీనిపై వివరణాత్మక ప్రకటన చేస్తారు' అన్నారు. అనంతరం చైర్మెన్ ఎం వెంకయ్యనాయుడు జీరో అవర్ నిర్వహించేందుకు ప్రయత్నించారు. వెంటనే ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై జీరో అవర్‌కు కొంత మంది సహకరించకపోవడంతో సభను వాయిదా వేస్తున్నానని చైర్మెన్ ప్రకటించారు. దీంతో ప్రారంభమైన తొమ్మిది నిమిషాలకే రాజ్యసభ కార్యకలాపాలు దాదాపు 50 నిమిషాల పాటు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదాపడ్డాయి. అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు చేబూని 'సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి' అంటూ నినాదాలు చేశారు. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతున్న సందర్భంలో డిప్యూటీ చైర్మెన్ హరివంశ నారాయణ్ సింగ్ జోక్యం చేసుకొని 'ఇది ప్రశ్నోత్తరాలు. నేను అనుమతించను' అని పేర్కొంటూ సభను వాయిదా వేశారు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో మల్లికార్జునఖర్గే మాట్లాడుతూ 12 మంది ఎంపీల సస్పెన్షన్ అంశాన్ని లేవనెత్తారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రతిపక్షాలు వెల్‌లోకి దూసుకెళ్లడంతో సభను మూడు నిమిషాలకే మధ్యాహ్నాం 3 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో దేశంలో ధరల పెరుగుదలపై స్వల్పకాలిక చర్చకు ప్యానల్ స్పీకర్ సస్మిత్ పాత్ర ప్రారంభించారు. చర్చ ప్రారంభించాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ 12 మంది ఎంపీలను సస్పెండ్ చేశారనీ, వారు బయట కూర్చొని ఉన్నారని తెలిపారు. వారు కూడా ఈ చర్చలో పాల్గొనాలని అన్నారు. దీనికి స్పందించిన ప్యానల్ స్పీకర్ ''అంశం స్వల్పకాలిక చర్చ'' అని అన్నారు. దీనిపై ఖర్గే ''ఒక్క నిమిషం సార్. 12 మంది ఎంపీలు ఐదు రోజులుగా బయట కూర్చొని ఉన్నారు. వారు లేకుండా సభలో చర్చ ప్రజాస్వామ్యంలో సిగ్గుమాలిన చర్య'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్యానల్ స్పీకర్ జోక్యం చేసుకొని ''ఇది ధరల పెరుగుదలపై చర్చ'' అనటంతో, వెంటనే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి, ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. పెట్రో ఉత్పత్తుల ధరలతో పాటు దేశంలో ధరల పెరుగుదలపై ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, ఆనంద్ శర్మ, మనోజ్ కుమార్ ఝా, ఫౌజియా ఖాన్ నోటీసులు ఇచ్చారనీ, చర్చను ప్రారంభించాలని ప్యానల్ చైర్మెన్ కోరారు. దీనిపై ఫౌజియా ఖాన్ మాట్లాడుతూ.. 'సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేస్తే...చర్చలో పాల్గొంటా. ధరలు పెరుగుదలపై చర్చలో అందరూ మాట్లాడాలి. అందుకే వారిపై సస్పెండ్ ఎత్తివేయాలి. లేకపోతే తమ అందరినీ సస్పెండ్ చేయండి'' అన్నారు. మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ''సార్ సభ ఆర్డర్లో లేదు. ధరలు పెరుగుదలపై మాట్లాడేందుకు సిద్ధంగానే ఉన్నాను. మీరు సభను ఆర్డర్లో పెట్టండి. మీరు సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేస్తే సభ ఆర్డర్‌లోకి వస్తుంది. అప్పుడు అన్ని చర్చలు సవ్యంగా జరుగుతాయి' అని తెలిపారు. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ.. కావాలనే సభను ఆర్డర్లో పెట్టాలని కోరుతున్నారన్నారు. దీంతో సభలో సభ్యుల నినాదాలతో గందరగోళం నెలకొనడంతో సభ సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైన సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాగాలాండ్ పరిస్థితులపై ప్రకటన చేశారు. అమిత్ షా మాట్లాడినంత సేపు ప్రతిపక్ష సభ్యులు వెల్‌లో ఆందోళన కొనసాగించారు. ప్రకటన అనంతరం ఆరు నిమిషాలకే సభ మంగళవారానికి వాయిదా పడింది.
లోక్‌సభలోనూ..
లోక్‌సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు నాగాలాండ్ పౌరుల కాల్చివేత అంశాన్ని లేవనెత్తాయి. కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ నాగాలాండ్ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. 17 మంది మరణించారనీ, దీనిపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. నాగాలాండ్‌లో శాంతి నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఎంసీ పక్షనేత సుధీప్ బందోపాధ్యాయ మాట్లాడుతూ నాగాలాండ్ ఘటన దేశాన్ని వణికించిందనీ, దీనిపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ఇది చాలా సున్నితమైన అంశమనీ, కేంద్ర హౌం మంత్రి దీనిపై వివరణాత్మక ప్రకటన చేస్తారని అన్నారు. టీఆర్ఎస్ ఎంపీ వెల్‌లోకి దూసుకెళ్లా ప్లకార్డు చేబూని ఆందోళన చేపట్టారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ సభ్యుల ప్రశ్నలకు సభలోనే సమాధానం చెప్పండని కేంద్ర మంత్రులకు సూచిం చారు. నాగాలాండ్ ఘటనపై కేంద్ర హౌం మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. అనంతరం ప్రతిపక్షాలు లేవనెత్తేందుకు ప్రయత్నించగా లోక్‌సభ స్పీకర్ అందుకు అంగీకరించలేదు. దీంతో కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ(ఎం), సీపీఐ సహా ప్రతిపక్ష పార్టీలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి.