Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్
- రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో పలు ఒప్పందాలు
- ప్రపంచంలో మార్పులొస్తున్న ఈ బంధం సుస్థిరం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: భారత్ మిత్రదేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో సోమవారం పర్యటించారు. ఇరు దేశాల మద్య చాలా కాలంగా కొనసాగుతున్న వార్షిక శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా పుతిన్ భారత్‌కు వచ్చారు. రెండు దేశాల మధ్య జరుగుతున్న 21వ శిఖరాగ్ర సమావేశానికి దేశరాజధాని ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ వేదికైంది. ద్వైపాక్షి వార్షిక సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులతో పాటు అఫ్ఘానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులు వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. అంతకు ముందు రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో పలు ఒప్పందాలు కుదిరాయి. భేటీ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ. పుతిన్ ఇక్కడకు రావడం భారత్‌తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తోందన్నారు. కరోనా కారణంగా ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్-రష్యాల మధ్య సంబంధాల్లో ఎటువంటి మార్పూ రాలేదని తెలిపారు. గత మూడు దశాబ్దాలుగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందనీ, ఆ ఘనత మీకే చెందుతుందని పుతిన్‌తో మోడీ అన్నారు. ఆర్థికరంగంలో సుదీర్ఘకాలంగా ఉన్న ఇరుదేశాలు సహకారాన్ని గుర్తుచేస్తూ.. భాగస్వామ్య లక్ష్యాలను సాధించడంలో భాగంగా వ్యాపారవేత్తలను కూడా ప్రోత్సహించుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయాల్లో వేగంగా మార్పులు వస్తున్నా.. ఇరు దేశాల మధ్య బంధం సుస్థిరంగా ఉందని మోడీ పేర్కొన్నారు. పుతిన్ మాట్లాడుతూ.. భారత్ తమకు నమ్మకమైన దేశమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా విసరడంతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 17 శాతం తగ్గిందని తెలిపారు. అయినప్పటికీ ఈ ఏడాది తొలి 9 మాసాల్లోనే అది 30 శాతం పెరిగిందని చెప్పారు. రెండు దేశాలు ఇంధనం, అంతరిక్ష రంగంలో కలిసి పనిచేస్తున్నాయన్నారు. వీటితో పాటు మిలిటరీ, సాంకేతిక రంగాల్లోనూ పూర్తి సహకారంతో కలిసి ముందుకెళ్తున్నాయన్నారు. ముఖ్యంగా ఉగ్రవాదులకు నిధులు, డ్రగ్స్ సరఫరా వంటి అన్ని అంశాలపై ఇరు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయని పుతిన్ గుర్తుచేశారు. అందుకే అఫ్ఘానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులపైనా సర్వసాధారణంగానే రెండు దేశాలు ఆందోళన చెందుతున్నట్టు పుతిన్ పేర్కొన్నారు. భారత్, రష్యా భూభాగాల్లో సంయుక్త సైనిక విన్యాసాలను సైతం పుతిన్ గుర్తు చేశారు.
పలు ఒప్పందాలపై సంతకాలు
భారత్-రష్యాల 21వ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయిగులు ఆ ఒప్పందాలపై సంతకాలు చేశారు. 7.63ఞ39ఎంఎం క్యాలిబర్ కలిగిన ఏకే-203 అజాల్ట్ రైఫిళ్ల తయారీ అంశంలోనూ రెండు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాల రక్షణ మంత్రులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. మొత్తం ఆరు లక్షల ఏకే-203 రైఫిళ్లను తయారీ చేయనున్నారు. 2021 నుంచి 2031 మధ్య కాలంలో ఆ ఆయుధాలను సమీకరించనున్నారు. కలష్నికోవ్ ఆయుధాల తయారీ గురించి 2019, ఫిబ్రవరిలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఏకే-203 రైఫిళ్లను తయారీ చేయనున్నారు. సుమారు రూ.5000 కోట్లతో భారత సాయుధ దళాల కోసం రైఫిల్స్‌ను తయారు చేయనున్నారు.