Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కావు
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
- నాగాలాండ్ ఘటనపై పార్లమెంట్లో కేంద్ర హౌం మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ : నాగాలాండ్‌లో పౌరుల హత్య ఘటన పొరపాటున జరిగిందనీ, అందుకు చింతిస్తున్నామని కేంద్ర హౌంమంత్రి అమిత్‌షా అన్నారు. ఉగ్రవాదులనే అనుమా నంతో కాల్పులు జరిపినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం నాగాలాండ్‌లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్టు అమిత్ షా తెలిపారు. పార్లమెంట్ ఉభయ సభల్లో నాగాలాండ్‌లో జరిగిన దుర్ఘటనపై కేంద్ర హౌం మంత్రి అమిత్ షా సోమవారం ప్రకటన చేశారు. నాగాలాండ్‌లో తీవ్రవాదులనుకొని సైన్యం జరిపిన కాల్పుల్లో 14 మంది పౌరులు మరణించిన ఘటనపై 'సిట్' దర్యాప్తునకు ఆదేశించామనీ, 30 రోజుల్లోగా దర్యాప్తును 'సిట్' పూర్తి చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ''ఓటింగ్ ప్రాంతంలో తీవ్రవాదుల కదలికలపై సైన్యానికి సమాచారం అందింది. ఆ సమాచారం ఆధారంగా 21 మంది కమండోలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అక్కడికి ఒక వాహనం రావడంతో, దానిని ఆపాలంటూ కమాండోలు సంకేతాలు ఇచ్చినప్పటికీ వాహనం ముందుకు వెళ్లింది. తీవ్రవాదాలను ఆ వాహనంలో తీసుకువెళ్తున్నారనే అనుమానంతో సైన్యం కాల్పులు జరిపింది. అయితే, ఆ తర్వాతే తీవ్రవాదులనుకుని పొరపాటుగా పౌరులపై కాల్పులు జరిపినట్టు నిర్ధారణ అయింది'' అని పేర్కొన్నారు. ''వాహనంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆర్మీ హెల్త్ కేర్ సెంటర్‌కు తరలించారు. పౌరులు చనిపోయారనే సమాచారం తెలియగానే స్థానికులు ఆర్మీ యూనిట్‌ను చుట్టుముట్టి వారిపై దాడికి దిగారు. రెండు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ దాడిలో ఒక భద్రతా జవాను మృతి చెందగా,పలువురు జవాన్లు గాయపడ్డారు. ఆత్మరక్షణ కోసం,మూకను చెదరగొట్టేందుకు సైన్యం కాల్పులకు దిగడంతో మరో ఏడుగురు పౌరులు మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. పరిస్థితిని స్థానిక యంత్రాంగం, పోలీసులు అదుపులోకి తెస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా అదుపులోనే ఉంది. సిట్ ఏర్పాటు చేశాం. నెలరోజుల లోపు దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలి చ్చాం'' అని అమిత్ షా తెలిపారు. ''కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ వెంటనే ఈశాన్య అదనపు కార్యదర్శిని కొహిమాకు పంపాం. అక్కడ అతను ఈ రోజు చీఫ్ సెక్రటరీ, ఇతర సీనియర్ అధికారులు, పారామిలటరీ బలగాల సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పరిస్థితిని కూలంకషంగా సమీక్షించారు. ఈ ఘటన వెనుక గల కారణాలపై ఆర్మీ ఉన్నత స్థాయిలో విచారణ చేపట్టింది'' అని తెలిపారు.