Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగళూరులోని పోలీసు స్టేషన్లో ఘటన.. ఎస్సై సస్పెండ్
న్యూఢిల్లీ: బెంగళూరులోని ఓ పోలీసు స్టేషన్లో ఒక ముస్లిం వ్యక్తిని పోలీసులు తీవ్రంగా హింహించడంతో పాటు అతనితో బలవంతంగా మూత్రం తాగించారు. ఉన్నతాధికారులు యువకుడిపై దాడిచేసిన ఎస్సైని సస్పెండ్ చేయడంతో పాటు ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. వివరాల్లోకెళ్తే.. పొరుగువారితో వాగ్వాదానికి దిగాడనే ఆరోపణలతో ముస్లిం యువకుడు తౌసిఫ్ పాషాను డిసెంబర్ 2న తెల్లవారు జామున 1 గంటల సమయంలో బెంగళూరులోని బైటరాయణపుర పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే, ఆ వ్యక్తే తన కుమారుడిపై దాడి చేశాడని చెప్పినప్పటికీ.. తన కుమారుడిని విడిచిపెట్టేందుకు పోలీసులు డబ్బులు డిమాండ్ చేశారని బాధితుడి తండ్రి అస్లాం పాషా అన్నారు. అదే పోలీసు స్టేషన్ విధులు నిర్వహిస్తున్న ఎస్సై హరీష్ కేఎన్‌తో పాటు పలువురు పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని బాధిత ముస్లిం యువకుడు తెలిపాడు. పోలీసులు తనను క్రికెట్ బ్యాట్‌తో దాదాపు 30 సార్లు కొట్టారని చెప్పాడు. తాగడానికి నీళ్లు అడిగితే.. బలవంతంగా తనతో మూత్రం తాగించారని తెలిపాడు. అలాగే, పోలీసులను ఎంత వేడుకున్న వినకుండా తన గడ్డాన్ని సైతం కత్తిరించారని చెప్పాడు. తనతో పోలీసు స్టేషన్ కూడా శుభ్రం చేయించారని తెలిపాడు. తనపై కిడ్పాప్ కేసు నమోదుచేసి.. రెండేండ్ల పాటు జైలుకు పంపుతామని బెదిరించారని తెలిపారు. ఇక పాషాపై కేసు పెట్టకపోయిన రెండు రోజుల పాటు పోలీసు స్టేషన్లోనే ఉంచారని బాధితుడి కుటుంబీకులు ఆరోపించారు. ఎమ్మెల్యే బీజెడ్ జమీర్ అహ్మద్‌ఖాన్ జోక్యంతో విడుదలయ్యాడని తెలిపారు. విడుదలైన తర్వాత పాషా ఆస్పత్రిలో చేరారని తెలిపారు. ఈ ఘటన ఉన్నతాధికారుల వరకు చేరడంతో దర్యాప్తునకు ఆదేశించారు. సోమవారం దర్యాప్తు నివేదిక అందడంతో ఈ ఘటనతో సంబంధం ఉన్న ఎస్సై హరీష్ కేఎన్ను సస్పెండ్ చేశారు. కర్నాటక పోలీసులు స్టేషన్లలో హింస చోటుచేసుకుంటున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నెల 1న పోలీసులు.. కస్టడీలో తనను తీవ్రంగా హింసించడంతో తన కుడిచేయి కోల్పోయానని సల్మాన్ అనే ఓ యువకుడు ఆరోపించాడు. తనకు ఏ సంబంధంలేని ఓ దొంగతనం కేసులు తనను పోలీసులు ఇరికించారని ఆరోపించారు. అలాగే, ఓ దళితుడికి బలవంతంగా మూత్రం తాగించాడన్న ఆరోపణలతో ఎస్సై అర్జున్ హౌరకేరి సెప్టెంబర్‌లో అరెస్టైన సంగతి తెలిసిందే.