Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామ్యదేశంలో దీనికి చోటు లేదు
- సాయుధ బలగాల ప్రత్యేక చట్టంపై సర్వత్రా ఆగ్రహం దశాబ్దాలుగా ప్రజలు కోరుతున్నా పట్టించుకోని పాలకులు
న్యూఢిల్లీ : తీవ్రవాదులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులపై పేలాల్సిన తూటా అమాయక పౌరులపైకి వె ళ్లింది. సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టం-1958...భద్రతా బలగాలకు కల్పిస్తున్న విశేష అధికారాలు నాగాలాండ్‌లో 14మంది అమాయక పౌరుల్ని బలిగొంది. ఈ ఘటన అక్కడ మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఉదంతాలు అనేకం చోటుచేసుకున్నాయి. అత్యంత వివాదాస్పాదమైన ఈ చట్టాన్ని రద్దు చేయాలని ఎన్నో ఏండ్లుగా ఈశాన్య రాష్ట్రాల ప్రజలు కోరుతున్నా మన పాలకులు వినిపించుకోవటం లేదు. ఇప్పుడీ చట్టం జీవించే హక్కును, స్వేచ్ఛను కాలరాస్తోంది. శనివారం నాగాలాండ్‌లో జరిగిన సైనిక కాల్పుల ఘటనతో దేశం యావత్తు నివ్వెరపోయింది. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, కాల్పుల ఘటనకు బాధ్యులైన అధికారులను కఠినంగా శిక్షించాలని వివిధ రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నాగాలాండ్, మేఘాలయ సీఎంలు కూడా వివాదాస్పద చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. భద్రతా బలగాలు ఇష్టమున్నట్టుగా కాల్పులకు దిగటాన్ని అనుమతించకూడదని వారు హెచ్చరిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలు కొండలు, కోనలతో ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. మైదాన ప్రాంతం చాలా తక్కువ. ఉగ్రవాదాన్ని అరికట్టడమనే పేరుతో కేంద్రం పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించింది. యుద్ధ ట్యాంకులు, సైనికులు, పెట్రోలింగ్ వాహనాలు మారుమూల ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి. మిలటరీ, పారామిలిటరీ బలగాలు పెద్ద సంఖ్యలో ఉండటం ఒక భయానక వాతావరణాన్ని తీసుకొచ్చింది. సైనిక బలగాల కాల్పుల్లో అమాయక పౌరులు మరణించటం సర్వసాధారణమైంది. దీనిపై దశాబ్దాలుగా పౌర సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజా కాల్పుల ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
'డిస్టర్బ్డ్ ఏరియా' (అలజడి ప్రాంతం)గా కేంద్రం నోటిఫై చేసిన ప్రాంతంలో సైనిక బలగాలకు వివాదాస్పద చట్టం విశేష అధికారాల్ని కల్పిస్తోంది. దాంతో ఇక ఆ ప్రాంతంలోని ప్రజలకు కష్టాలు మొదలవుతాయని పౌర హక్కుల నేతలు చెబుతున్నారు. 'డిస్టర్బ్డ్ ఏరియా' అనే పేరుతో అప్రకటిత ఎమర్జెన్సీని కేంద్రం అమలుజేస్తోందని, దశాబ్దాలుగా ఇదే విధానం నడుస్తోందని వారు అన్నారు. భద్రత, రక్షణ పేరుతో పౌరుల ప్రాథమిక హక్కులు కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి వారెంట్ లేకుండానే అరెస్టులుంటాయని, సైన్యం బహిరంగ కాల్పులకు దిగుతుందని వారు ఆరోపించారు. నాగాలాండ్‌లో తాజా ఘటనపై కేంద్రం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. సైన్యం కూడా కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది. వీటితో బాధితులెవరికీ న్యాయం జరగదని ప్రతిపక్షాలు, పౌర హక్కుల నేతలు విమర్శిస్తున్నారు. వివాదాస్పద చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.