Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల వివక్షను అంతం చేయాల్సిందే: జస్టిస్ డీవై.చంద్రచూడ్
న్యూఢిల్లీ: కుల వివక్షను అంతం చేయాల్సిన అవసరాన్ని ఎత్తి చూపుతూ.. సమాజంలో మార్పులు తీసుకురావడానికి డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఆలోచనలను ఉపయోగించుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై.చంద్రచూడ్ అన్నారు. ఇదే సమయంలో అట్టడుగు వర్గాల వారికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ఉండల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్-ఢిల్లీ, రోసా లక్సెంబర్గ్ స్టిఫ్టంగ్ సౌత్ ఏసియాలు నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ 13వ స్మారక ఉపన్యాసం సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ పై వ్యాఖ్యలు చేశారు. అలాగే, ''కుల రహితత అనేది అగ్రవర్ణాల వారికి మాత్రమే పొందగలిగే ప్రత్యేక విశేషం, ఎందుకంటే వారి కుల ప్రత్యేకత ఇప్పటికే సామాజికంగా , రాజకీయంగా, ఆర్థిక పరంగా వారిని మెరుగైన పరిస్థితుల్లోకి మార్చింది. వారు తమ కుల గుర్తింపును వదులుకోవడానికి సరిపోతుంది. అయితే, అట్టడుగు వర్గాల వ్యక్తులకు ఇది ఎప్పటీకీ సరిపోదు. అట్టడుగు కులానికి చెందిన వ్యక్తులు రిజర్వేషన్లు వంటి చర్యల ప్రయోజనాలను పొందడానికి తమ కుల గుర్తింపును నిలుపుకోవాలి'' అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. అగ్రవర్ణాలు, సమాజంలోని ప్రత్యేక సభ్యులు తమ కుల సంకెళ్లను తెంచుకోవాలని అన్నారు. ఇదే సమయంలో అణగారిని వర్గాల సభ్యుల గుర్తింపు, వారికి గౌరవాన్ని ఇవ్వాలని తెలిపారు. ఉన్నత కులాల వ్యక్తుల వృత్తిపరమైన విజయాలు వారి కుల గుర్తింపును తొలగించుకోవడానికి సరిపోతాయి కానీ, దిగువ కుల వ్యక్తులకు ఇది ఎప్పటికీ సరిపోదని అన్నారు. కులం ఒకరి గుర్తింపును నిర్వచించనివ్వకపోవడం గురించి మాట్లాడుతూ.. కులరహితత అనేది ఉన్నత కులాలవారు మాత్రమే భరించగల ఆధిక్యత అనీ, రిజర్వేషన్ వంటి చట్టాల రక్షణను ఉపయోగించుకోవడానికి దిగువ కుల సభ్యులు తమ కుల గుర్తింపును పట్టుకోవాలని అన్నారు. అలాగే, లింగ వివక్షపైనా జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడారు. 72 సంవత్సరాల క్రితమే అందరికీ న్యాయం, స్వేచ్చ, సమానత్వం కల్పించే రాజ్యాంగం వచ్చింది. అయితే, 2005లో మాత్రమే మహిళలను సమాన సహ భాగస్వాములుగా పరిగణించారు. అలాగే, 2018 నుంచి మాత్రమే స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడం లేదని తెలిపారు. దీనికి సంబంధించిన తీర్పులు ఉన్నప్పటికీ భవిష్యత్తులోనే సామాజిక పరివర్తన చూపబడుతుందన్నారు.