Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతమార్పిడికి వ్యతిరేకమంటూ కాషాయమూకల దాడి
- భయంతో పరుగులు తీసిన విద్యార్థులు
భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఒక క్రిస్టియన్ పాఠశాలపై సోమవారం విశ్వహిందూపరిషత్ (వీహెచ్పీ) కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ పాఠశాలలో చదివే విద్యార్థులను యాజమాన్యం మత మార్పిడికి ప్రోత్సహిస్తోందంటూ ఆరోపిస్తూ...కాషాయ మూకలు దాడికి పాల్పడ్డారు. వీహెచ్పీ తెగబడినపుడు.. ఆ సమయంలో పాఠశాలలో 12 వ తరగతి విద్యార్థులకు లెక్కల పరీక్ష జరుగుతోందని పోలీసులు తెలిపారు. పాఠశాల యాజమాన్యం సహకారంతో ఎనిమిది మంది విద్యార్థులు మతం మార్చుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయంటూ విదిశ జిల్లాలోని గంజ్ బసోదా నగరంలోని క్రిస్టియన్ మిషనరీకి చెందిన సెయింట్ జోసెఫ్ పాఠశాలపై వీహెచ్పీ కార్యకర్తలు ఒక్కసారిగా బీభత్సం సృష్టించారు. పాఠశాల భవనంపై రాళ్లు రువ్వారు. ఒక గ్రూపుగా మూకలు నినాదాలు చేసుకుంటూ.. రాళ్ల దాడికి పాల్పడ్డారు. అద్దాలు ధ్వంసమవుతుంటే.. విద్యార్థులు, పాఠశాల సిబ్బంది భయంతో పరుగులు తీశారు. దాడి జరగబోతుందని స్థానిక మీడియా నుంచి సమాచారం అందడంతో పోలీసులకు సమాచారమిచ్చామనీ.. అయితే పోలీసులు పట్టించుకోలేదని, సరైన భద్రత కల్పించలేదని పాఠశాల మేనేజర్ బ్రదర్ ఆంటోనీ తెలిపారు. మత మార్పిడికి సంబంధించిన వాదనలను కూడా ఆయన ఖండించారు. ఆ ఫిర్యాదులో పేర్కొన్న విద్యార్థుల పేర్లు పాఠశాల విద్యార్థుల పేర్లతో సరిపోలలేదని అన్నారు. కాగా, మతమార్పిడిలో యాజమాన్యం పాత్ర ఉన్నదని నిర్థారణైతే.. పాఠశాల భవనాన్ని కూల్చివేస్తామని స్థానిక విశ్వహిందూపరిషత్ యూనిట్ నేత నీలేష్ అగర్వాల్ బెదిరించారు. దీంతో ఇతర మిషనరీ పాఠశాలల భవనాలకు కూడా పోలీసులు భద్రతను పెంచారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ రోషన్ రారు పేర్కొన్నారు. కాగా, పాఠశాలపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయించాలని జాతీయ చిన్నారుల హక్కుల భద్రత కమిషన్ విదిశ జిల్లా కలెక్టర్కు లేఖ రాసింది.
బీజేపీ పాలిత రాష్ట్రంలో నాలుగో కేసు..
రాష్ట్రంలో 'యంత్రాల ద్వారా మార్పిడి' జరిగిందని ఆరోపిస్తూ..దాడికి పాల్పడిన నాలుగో కేసు ఇది. గతంలో ఖర్గోన్లో మతమార్పిడికి సంబంధించి ఓ మహిళ, ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దాని వీడియో వైరల్గా మారింది. అందులో 22 మంది మతం మారారని ఓ వ్యక్తి చెబుతున్నాడు.ఝబువాలో మత మార్పిడికి సంబంధించి 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైసన్స్ బాలికల హాస్టల్లో హిందూ బాలికలను మతమార్పిడి చేయడంపై బాలల కమిషన్కు ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు మతపరమైన పుస్తకాలు ఇచ్చి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. గంజ్బాసోడాలో ఇలాంటి కేసు బహిర్గతం కావడంతో దానిపై దుమారం రేగింది. బీజేపీ పాలిత రాష్ట్రంలో మైనార్టీ ప్రాణాలకు భయంగా ఉన్నదని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నారు.