Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరింత వివరణ ఇవ్వండి
- నేటి మధ్యాహ్నం సింఘూ సరిహద్దులో ఎస్కేఎం సమావేశం
న్యూఢిల్లీ : రైతు డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. చాలా రోజులకు రాతపూర్వక ప్రతి పాదనలు చేసింది. రైతు ఉద్యమం ఉధృతం కావటంతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. రైతు సంఘాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు మంగళవారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం)కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాతపూర్వక ముసాయిదా ప్రతిపాదనను అందచేసింది. కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై సింఘూ సరిహద్దు వద్ద మంగళవారం జరిగిన ఎస్కేఎం సమావేశంలో రైతు నేతలు నిర్మాణాత్మకంగా చర్చించారు.
ప్రభుత్వ ప్రతిపాదనలోని కొన్ని అంశాలపై మరిన్ని వివరణలు ఎస్కేఎం కోరుతున్నది. తదుపరి చర్చ కోసం నేడు మధ్యాహ్నం 2 గంటలకు సింఘూ సరిహద్దు వద్ద ఎస్కేఎం తిరిగి సమావేశం కానుంది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఎస్కేఎం భావిస్తోంది.
కేంద్రం పంపిన ప్రతిపాదన
1. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై స్వయంగా ప్రధానమంత్రి, తరువాత వ్యవసాయ మంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉంటారు. రైతు ప్రతినిధిల్లో ఎస్కేఎం ప్రతినిధులు కూడా ఉంటారు.
2. ఆందోళన సమయంలో రైతుల కేసుల విషయానికొస్తే, ఉత్తరప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు ఆందోళన విరమించిన వెంటనే కేసులను ఉపసంహరించుకుంటామని పూర్తిగా అంగీకరించాయి. అలాగే రైతుల ఉద్యమ సమయంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రైతులపై నమోదైన కేసులను కూడా ఉద్యమాన్ని ఉపసంహరించుకున్న తర్వాత కేసును ఉపసంహరించుకోవడానికి అంగీకరిస్తున్నాం.
3) పరిహారం విషయానికొస్తే, దీనికీ హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. కేసులు, పరిహారంపై పంజాబ్ ప్రభుత్వం బహిరంగ ప్రకటన కూడా చేసింది.
4) విద్యుత్ బిల్లు విషయంపై పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తీసుకుంటాం.
5) పంట వ్యర్థాలు తగలపెట్టే రైతులపై జరిమాన సమస్య విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టం సెక్షన్ 14, 15లో నేర బాధ్యత నుండి రైతులకు మినహాయింపు ఇచ్చింది.
ఈ విధంగా ఐదు డిమాండ్లను పరిష్కరిస్తున్నామనీ, ఇప్పుడు రైతు ఉద్యమాన్ని కొనసాగించడాన్ని సమర్థనీయం కాదు అని కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ప్రతిపాదనల్లో పేర్కొంది.