Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభ నడిచింది 24 నిమిషాలే
- ప్రతిపక్షాల ఆందోళనతో దద్దరిల్లిన పార్లమెంట్
- ప్రభుత్వమే కారణం : మల్లికార్జున ఖర్గే
- ఉద్యమంలో మరణించిన రైతులకు పరిహారం ఇవ్వండి : రాహుల్ గాంధీ
- పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టీఆర్ఎస్
న్యూఢిల్లీ : రాజ్యసభ కార్యకలాపాలు మంగళవారం పూర్తిగా స్తంభించాయి. 12 మంది ఎంపీల సస్పెన్షన్పై ప్రతిపక్షాల ఆందోళనతో సభా కార్యకలాపాలు నిలిచిపోయాయి. క్షమా పణలు చెప్పాలని అధికార పక్షం పట్టుపడుతుంటే.. రాజ్యాంగ, నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేసి, ఇప్పుడు క్షమాపణలు కోరడమా? అని ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నది. క్షమాపణలు చెప్పేదే లేదని ప్రతిపక్షం స్పష్టం చేస్తున్నది. సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్నాయి. దీంతో రాజ్యసభ కార్యకలాపాల్లో ప్రతిష్టంభన నెలకొన్నది. రాజ్యసభ కార్యకలాపాలు మంగళవారం కేవలం 24 నిమిషాలు మాత్రం జరిగాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే 12 మంది ఎంపీల సస్పెన్షన్ అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తాయి. దీంతో చైర్మెన్ ఎం.వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. దీంతో ప్రారంభమైన నాలుగు నిమి షాలకే సభ మూడు గంటల పాటు వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా సరోగసీ (రెగ్యులేషన్) బిల్లు, సహాయ పునరుత్పత్తి సాంకేతికత (నియంత్రణ) బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ''ప్రతిపక్ష నేత మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే, కేంద్ర మంత్రి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తున్నారు'' అని అన్నారు. 12మంది సభ్యుల సస్పెన్షన్ అప్రజాస్వామ్యమన్నారు. డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ్ సింగ్ జోక్యం చేసుకొని సభా కార్యకలాపాలపై మాట్లాడాలని సూచించారు. సభ్యుల సస్పెన్షన్పై ప్రతిపక్ష నేత, అధికార పక్షనేత మాట్లాడుకుంటే సరిపోతుందని అన్నారు. వెంటనే సభ్యుల సస్పెన్షన్పై టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. డిప్యూటీ చైర్మన్ దాన్ని అనుమతించలేదు. వెంటనే సభను మూడు గంటలకు వాయిదా వేశారు. ప్రారంభమైన ఏడు నిమిషాలకే సభ వాయిదా పడింది. తరువాత ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళనతో దద్దరిల్లింది. దీంతో సభ 13 నిమిషాలకే నేటీ (బుధవారం)కి వాయిదా పడింది.
లోక్సభలో..
మరోవైపు లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు (వేతనాలు, సర్వీస్ పరిస్థితులు) బిల్లును మంగళవారం ప్రవేశపెట్టారు. చర్చ జరిగింది.
రాజ్యసభలో ప్రతిష్టంభనకు ప్రభుత్వం కారణమే: మల్లికార్జున ఖర్గే
రాజ్యసభ ప్రతిష్టంభనకు ప్రభుత్వమే కారణమని ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. 'గత సమావేశాల్లో ఘటనపై ఈ సమావేశాల్లో సభ్యులను సస్పెండ్ చేసే హక్కు ప్రభుత్వానికి లేదు. వారి సస్పెన్షన్ చర్య నిబంధనల ప్రకారం, రాజ్యాంగ ప్రకారం జరగలేదు. సభను అనుమతించకూడదన్న ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తున్నది. ఎంపీల సస్పెన్షన్ను రద్దు చేసే వరకు మా పోరాటం కొనసాగుతుంది' అని స్పష్టం చేశారు. 'మా గొంతును నొక్కుతుంటే మేం చూస్తూ ఊరుకోం. ప్రజాస్వామ్యంలో దీనికి స్థానం లేదు. నియంతృత్వాన్ని మేం అనుమతించం. మోడీ ప్రభుత్వం పార్లమెంటును నియంతృత్వంతో నడపాలనుకుంటున్నారు. ఇది జరగడానికి మేం అనుమతించం' అని తెలిపారు.
క్షమాపణ చెబితే సస్పెన్షన్ రద్దుకు సిద్ధం
క్షమాపణ చెబితే సస్పెన్షన్ రద్దుకు సిద్ధమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. 'ఎంపీలు క్షమాపణ చెబితే, సస్పెన్షన్ను ఉపసంహరించుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం' అన్నారు.
ఉద్యమంలో మరణించిన రైతులకు పరిహారం ఇవ్వండి : రాహుల్ గాంధీ
రైతు ఉద్యమంలో మరణించిన అన్నదాతలకు పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లోక్సభ జీరో అవర్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ రైతు ఉద్యమంలో దాదాపు 700 మంది మరణించారనీ, వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 'రైతులు న్యాయం కోరుతూనే ఉన్నారు. వ్యవసాయాన్ని ప్రభావితం చేసే వివిధ సమస్యలపై డిమాండ్లను లేవనెత్తారు. ఏడాది పొడవునా ఆందోళనలో తమను తాము త్యాగం చేసిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలి' అని రాహుల్ గాంధీ కోరారు. ''పంజాబ్ ప్రభుత్వం దాదాపు 400 మంది రైతులకు రూ. 5 లక్షల పరిహారం అందించింది. వారిలో 152 మందికి ఉద్యోగాలు కూడా కల్పించింది. నా దగ్గర జాబితా ఉంది. మేం హర్యానా నుంచి 70 మంది రైతులతో మరొక జాబితాను తయారు చేసాం. వారి పేర్లు మీ వద్ద లేవని మీ ప్రభుత్వం చెబుతున్నది. రైతుల ఆందోళనలో దాదాపు 700 మంది రైతులు చనిపోయారు. ప్రధాని దేశానికి, దేశంలోని రైతులకు క్షమాపణలు చెప్పారు. తాను తప్పు చేశానని అంగీకరించారు. ఆందోళనలో ఎంత మంది రైతులు చనిపోయారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని గత నెల 30న ప్రశ్న అడిగారు. తన వద్ద ఎలాంటి డేటా లేదని మంత్రి చెప్పారు. మా వద్ద మరణించిన రైతుల జాబితా ఉంది. మేం మీకు ఇస్తాం'' అని రాహుల్ గాంధీ అన్నారు.
12 మంది ఎంపీల సస్పెన్షన్పై పార్లమెంట్లో ఆందోళన
12 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై ప్రతిపక్షాలు మంగళవారం పార్లమెంట్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగాయి. ప్లకార్డులు చేబూని 'సస్పెన్షన్ ఎత్తివేయాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి' అంటూ నినాదాలుచేశారు. సస్పెన్షన్ అప్రజాస్వామికమని, రాజ్యసభలోని అన్ని నిబంధనలను ఉల్లంఘించడమేనని ప్రతిపక్ష సభ్యులు తెలిపారు. మరోవైపు సస్పెండ్ అయిన 12 మంది ఎంపీలు తమ ధర్నాను మంగళవారం కూడా కొనసాగించారు. ధర్నా చేస్తున్న ఎంపీలకు ఎన్సీపీ అధినేత శరద్ పవర్, ఎస్పీ నేత జయ బచ్చన్, శివసేన నేత సంజరు రౌత్, డీఎంకే నేత తిరుచ్చి శివ, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ తదితరులు సంఘీభావం తెలిపారు. కేంద్ర 'కుయుక్తుల'కు ప్రతిపక్షాలు తలొగ్గవని స్పష్టం చేశారు.
ఉభయ సభలను బహిష్కరిస్తున్నాం : టీఆర్ఎస్ ఎంపీలు
పార్లమెంట్ ఉభయ సభలను బహిష్కరిస్తున్నట్టు టీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ బుధవారం నుంచి సభలకు హాజరుకాబోమని పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు తెలిపారు. నల్ల చొక్కాలు ధరించి ఉభయ సభల్లో మంగళవారం ఆందోళన చేపట్టారు. కేంద్ర మొండి వైఖరిని నిరసిస్తూ ఉభయ సభలను వాకౌట్ చేశారు. ''కేంద్ర ప్రభుత్వ వివక్షతతో కూడిన పంటల సేకరణ విధానం, తెలంగాణ నుంచి పంటలను సేకరించకపోవడం''పై టీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు రాజ్యసభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. లోక్సభలో నామా నాగేశ్వరరావు ''పంట సేకరణపై జాతీయ విధానం తీసుకురావాలి. ఎంఎస్పీకి చట్టబద్దత ఇవ్వాలి'' అంటూ వాయిదా తీర్మానం ఇచ్చారు. దాన్ని చైర్మెన్ ఎం.వెంకయ్య నాయుడు, స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు.