Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలు మరింత పేదరికంలోకి.. ధనికులు, కార్పొరేట్లు పైపైకి..
- ఆర్థిక సంస్కరణలు, నయా ఉదారవాద విధానాలే కారణం
- 50 శాతం కుటుంబాలకు అసలేమీ లేదు : ప్రపంచ అసమానతల నివేదికలో వెల్లడి
భారత దేశంలో పేదలు మరింత పేదరికంలోకి కూరుకుపోయారు. ఒక్కశాతమున్న ధనికులు, కార్పొరేట్లు మరింత ధనవంతులయ్యారు. జాతి సంపదలో అధిక భాగం పోగేసుకున్నారు. దేశ జనాభాలో 50శాతం మంది...జాతీయ ఆదాయంలో పొందుతున్న వాటా కేవలం 13శాతం. మరోవైపు ఒక్కశాతమున్న అత్యంత ధనికులు, కార్పొరేట్లకు దక్కుతున్న వాటా 22శాతం. భారతదేశంలో అనూహ్యమైన ఆదాయ అసమానతలు న్నాయి. దీనికి కారణం 1985 తర్వాత పాలకులు ఎంచుకున్న ఆర్థిక సంస్కరణలు, నయా ఉదారవాద విధానాలు.
- వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ నివేదిక
న్యూఢిల్లీ : భారతదేశంలో ధనికులు-పేదలకు మధ్య అంతరాలు తీవ్రస్థాయిలో ఉన్నాయని 'ప్రపంచ అసమానతల నివేదిక' గణాంకాల్ని విడుదల చేసింది. జాతీయ ఆదాయం(2021 ఏడాది)లో 22శాతం వాటా జనాభాలో ఒక్కశాతమున్న అత్యంత ధనికలు, కార్పొరేట్లకు దక్కుతోందని, ధనవంతుల జాబితాలో మొదటి 10 శాతం మంది చేతిలో 57శాతం ఆదాయముందని పేర్కొన్నది. ఇక సంపద విషయంలో పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని పేర్కొన్నది. నిజానికి మధ్య తరగతి కూడా పేదరికంలో కూరుకుపోయారని, 50శాతం పేద కుటుంబాలకు ఎలాంటి సంపదా లేదని నివేదికలో పరిశోధకులు తెలిపారు. ధనికవర్గానికి చెందిన 10శాతం మంది చేతిలో 65శాతం దేశ సంపద పోగై ఉందని పేర్కొన్నారు. నివేదికలో పరిశోధకలు వెల్లడించిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి.
ప్రభుత్వ గణాంకాలపై అనుమానం!
పేదరికం, అసమానతలు, లింగ అసమానతలపై భారత ప్రభుత్వం విడుదల చేసే సమాచారం, గణాంకాలు పారదర్శకంగా లేవు. ముఖ్యంగా అసమానతలపై గత మూడేండ్లుగా విడుదల చేస్తున్న సమాచారం లోపభూయిష్టంగా ఉంది. భారత్లో లింగ అసమానతలు కూడా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. మహిళా కార్మికుల ఆదాయం కేవలం 18శాతానికి పరిమితమైంది. ఆసియాలో సగటు ఆదాయం కన్నా ఇది తక్కువ. అసమానతల న్నింటికీ ప్రధాన కారణం 1985 తర్వాత వచ్చిన ఆర్థిక సంస్కరణలే. పాలకులు ఎంచుకున్న నయా ఉదారవాద విధానాలు ధనికులు, కార్పొరేట్లకు భారీ ఎత్తున ఆదాయాన్ని సమకూర్చింది. సంపద పోగేసుకోవటానికి అవకాశాలు కల్పించింది. ఆర్థిక సంస్కరణలతో ధనికులు బాగా లబ్దిపొందారు. దిగువ, మధ్య తరగతి, పేదల కుటుంబాల్లో మాత్రం ఎలాంటి మార్పునూ తీసుకురాలేదు. మరింత పేదలుగా మార్చింది.
వారి వద్ద అసలేమీ లేదు!
భారతదేశంలో సగటు ఆదాయం ఏడాదికి రూ.2,04,200గా ఉంది. అత్యంత ధనికుల్లో (మొదటి 10 శాతం మంది) ప్రతి ఒక్కరికీ సగటు ఆదా యం రూ.63,54,070 కాగా, ఒక్కశాతం మంది సగటు ఆదాయం రూ. 3,24,49,360 ఉందని నివేదికలో పేర్కొన్నారు. సంపద విషయంలో కింద వున్న 50శాతం కుటుంబాల వద్ద అసలేమీ లేదు. మధ్య తరగతి వద్ద 29.5 శాతం సంపద ఉంది. అదే పైన ఉన్న 10శాతం మంది వద్ద 65శాతం, 1శాతం ధనికుల వద్ద 33శాతం సంపద ఉన్నట్టు నివేదిక తేలిపింది.
లింగ అసమానతలు
1985 తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక సంస్కరణలు భారత్లో అసమానతల్ని పెంచాయని నివేదిక పేర్కొన్నది. ముఖ్యంగా పైన ఉన్న ఒక్కశాతం మంది ఆర్థిక సంస్కరణల వల్ల భారీగా లబ్దిపొందారని తెలిపింది. తక్కువ, మధ్య ఆదాయ సమూహాల మధ్య వృద్ధి సాపేక్షంగా ఉన్నట్టు పేర్కొన్నది. 1985 తర్వాత నుంచి పేదరికం పెరుగుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. అలాగే దేశంలో లింగ అసమానతలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది.