Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: కేరళలో 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నుంచి 2021 ఏప్రిల్‌లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల వరకు తన విజయ పరంపరను కొనసాగిస్తున్న ఎల్డీఎఫ్.. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించింది. ఈ విజయంతో రాష్ట్రంలో ఎల్డీఎఫ్కు ప్రజాబలం మరింతగా పెరింగిందని తెలియజేస్తున్నాయి. మొత్తం 32 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ 17 స్థానాలు గెలుచుకోగా, యూడీఎఫ్ 13 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ ఒక్క స్థానం మాత్రమే దక్కించుకుంది. అలప్పుజా, పాలక్కాడ్, కోజికోడ్‌లోని మూడు జిల్లా పంచాయతీ పూర్తి వార్డుల్లోనూ ఎల్డీఎఫ్ అభ్యర్థులు విజయం సాధించారు. అలప్పుజా జిల్లా పంచాయతీలోని అరూర్ డివిజన్లో అనంతు రమేశన్ (సీపీఐ(ఎం) 10,063 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం అరూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన దలీం జోజు 2020లో ఈ డివిజన్‌లోనే 3,495 ఓట్ల తేడాతో గెలుపొందారు. శ్రీకష్ణాపురం డివిజన్ పాలక్కాడ్ జిల్లా పంచాయతీలో సీపీఐ(ఎం) అభ్యర్థి కే శ్రీధరన్ 9270 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కోజికోడ్ జిల్లాలోని నన్మిండా డివిజన్లో సీపీఐ(ఎం) అభ్యర్థి రజియా తొట్టాయి 6766 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. తిరువనంతపురం, కొచ్చి కార్పొరేషన్లలోని డివిజన్లలో ఎల్డీఎఫ్ అభ్యర్థులు క్లైనస్ రొసారియో, బిందు శివన్‌లు గెలుపొందారు. మూడు మున్సిపల్ వార్డులకు కూడా ఎన్నికలు జరిగాయి. పిరవామ్ మున్సిపాలిటీలో సీపీఐ(ఎం) గెలుపొందగా, కంజంగఢ్, ఇరింగాలక్కుడా లలో కాంగ్రెస్ గెలుపొందింది.