Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: విద్యుత్ సవరణ బిల్లు 2021ను ఉప సంహరించుకోవాలని ప్రధాని మోడీకి తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం లేఖ రాశారు. విద్యుత్ చట్టం 2003కి ప్రతిపాదించిన సవరణలు 'రాష్ట్ర డిస్కంలకు తీవ్రమైన హాని' కలిగించేవిధంగా ఉన్నాయని, కాబట్టి ఈ సవరణలను ఉపసంహరించుకోవడానికి తక్షణమే జోక్యం చేసుకోవాలని లేఖలో ప్రధానిని స్టాలిన్ కోరారు. సవరణల్లో 'డిస్ట్రిబ్యూషన్ కంపెనీ' అనే కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా విద్యుత్ పంపిణీ రంగానికి లైసెన్స్‌ని రద్దు చేయాలని బిల్లుకు సవరణలు ప్రతిపాదిస్తున్నాయని, దరఖాస్తు చేసిన 60 రోజుల్లో ఏ పంపిణీ సంస్థకైనా డీమ్డ్ రిజిస్ట్రేషన్ చేసే విధంగా సవరణలు ప్రతిపాదించారని లేఖలో స్టాలిన్ తెలిపారు. 'ఇలాంటి ప్రతిపాదనలు ఎంపిక చేసుకున్న వినియోగదారులకు విద్యుత్‌ను సరఫరా చేయడానికి ప్రయివేట్ సంస్థలకు మితిమీరిన అను మతి ఇస్తున్నాయని, ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలు ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్‌ను ఉపయోగించడానికి ప్రయివేటు సంస్థలకు అనుమతిస్తున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలు ఇటువంటి నెట్‌వర్క్‌ల్లో పెట్టుబడి భారాన్ని మోస్తుండగా, ఈ ప్రయివేట్ కంపెనీలు ఎటువంటి పెట్టుబడి, ఎటు వంటి బాధ్యత లేకుండా వీటిని నిర్వహించడానికి, ఉపయోగించుకోవడానికి అనుమతిస్తున్నాయి' అని స్టాలిన్ విమర్శించారు. ఇటువంటి సవరణలతో కొత్త ప్రయివేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు వాణిజ్యపరంగా లాభదాయకమైన ప్రాంతాల్లో వినియోగదారులం దరినీ ఎంపిక చేసుకుంటాయని, ప్రయివేటు సంస్థలకు 'ఏ విధమైన సామాజిక బాధ్యతలు లేకుండా లాభదాయకమైన వెంచర్లను ఎంచుకునే హక్కు' ఈ సవరణలతో లభిస్తుందని తెలిపారు. సబ్సిడీ కలిగిన వినియోగదారులకు విద్యుత్‌ను సరఫరా చేయడం, ఆర్థికంగా వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ సేవలు అందించడం రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు ఒక బాధ్యతగా మిగిలిపోతుందని స్టాలిన్ పేర్కొన్నారు.
విద్యుత్ (సవరణ) బిల్లు 2021ని ఉపసంహరిం చుకోవడానికి, రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని డిస్ట్రిబ్యూషన్ లైసెన్సులు అనుమతించడానికి, ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడానికి వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీని లేఖలో స్టాలిన్ కోరారు.