Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: గత ఐదేండ్లలో 321మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తుండగా ప్రమాదవశాత్తు చనిపోయారని లోక్‌సభలో కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 58,098మంది కార్మికులు పారిశుద్ధ్య పనులు నిర్వర్తిసున్నారని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మానవ మలమూత్రాల్ని పారిశుధ్య కార్మికుల చేతితో శుభ్రం చేయించటం, తరలించటం, ఎత్తటం..చట్టప్రకారం నేరం. దీనికి సంబంధించి భారతదేశంలో 1993లో ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. దీని ప్రకారం..మరుగుదొడ్లను, మురుగునీటి గుంటల్ని, కాల్వల్ని, దొడ్లను, రైల్వే పట్టాలపైన మలమూత్రాల్ని పారిశుద్ధ్య కార్మికుల చేతులతో శుభ్రం చేయించటం నిషేధం. ఎవరైనా వ్యక్తులు, ప్రభుత్వ ప్రయివేటు కార్యాలయాలు ఆ విధంగా కార్మికులతో పనిచేయించితే చట్టప్రకారం శిక్షార్హులు. తగిన పరికరాలతో మరుగుదొడ్లు, వీధులు ఊడ్చేపనులు, మురుగునీటి నాలాల్లో చెత్తను ఎత్తేయటం..వంటివి పారిశుద్ధ కార్మికులతో చేయించాలని చట్టం చెబుతోంది. అయితే నగరాల్లోని మురుగునీటి కాల్వల్లో చెత్తను తీసేప్పుడు, మరుగుదొడ్లను క్లీనింగ్ చేపేప్పుడు ప్రమాదవశాత్తు గత ఐదేండ్లలో 321మంది చనిపోయారని కేంద్ర మంత్రి లోక్‌సభలో తెలిపారు. సభలో ఆయన చెప్పినదాన్ని ప్రకారం, ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 32,473మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి కేంద్రం సహాయ, పునరావాస పథకాన్ని అమలుజేస్తోందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కింద జన్ ఆరోగ్య యోజన బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నామని తెలిపారు. అయితే పారిశుధ్ద్య కార్మికుల మరణాల్ని కేంద్ర తక్కువ చేసి చూపుతోందని హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్లీనింగ్ ప్రక్రియ చేపట్టే సమయంలో యాజమాన్యం కార్మికులకు తగిన పరికరాలు, దుస్తులు ఇవ్వటం లేదని, రక్షణ చర్యలు తీసుకోవటం లేదని వారు ఆరోపిస్తున్నారు. చట్టాన్ని సరిగా అమలుజేయకపోవటం వల్ల అనేక చోట్ల కార్మికులు బలవంతంగా ఉత్తచేతుల్తో మురుగు కాల్వల్లోకి, గుంటల్లోకి దిగాల్సివస్తోందని, మరుగుదొడ్లను క్లీనింగ్ చేయాల్సి వస్తోందని హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.