Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భీమా కోరేగావ్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ న్యాయవాది, హక్కుల కార్యకర్త సుధా భరద్వాజ్ మూడేండ్ల అనంతరం జైలు నుంచి విడుదల కానున్నారు. ఆమె బెయిల్‌కు సంబంధించి బుధవారం జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం పలు షరతులు విధించింది. ఆమె పాస్‌పోర్ట్‌ను కోర్టుకు సమర్పించాలనీ, ముంబయిలోనే ఉండాలని ఎన్ఐఏ స్పెషల్ కోర్టు పేర్కొంది. అలాగే ఈ కేసుకు సంబంధించి మీడియా సమావేశాల్లో పాల్గనకూడదనీ, రూ.50వేల పూచీ కత్తు సమర్పించాల్సిందిగా ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా ముంబయి విడిచి వెళ్లరాదని పేర్కొంది. సుధా భరద్వాజ్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది బుధవారం ఆమెను విడుదల చేయాలని కోరారు. అయితే, దానికి అవసరమైన పత్రాలు అందించడం, వాటిని ధ్రువీకరించడం పూర్తయిన తర్వాత మాత్రమే విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టు తెలిపింది. కాగా, ఈ నెల మొదటి వారంలోనే బాంబే హైకోర్టు సుధా భరద్వాజ్‌కి డిఫాల్ట్బెయిల్ను మంజూరు చేసింది. అయితే, ఈ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఎన్ఐఏ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. మంగళవారం నాడు కొట్టివేసింది. 'బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదు.. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం' అంటూ న్యాయమూర్తులు జస్టిస్ లలిత్, జస్టిస్ ఎం.త్రివేది, జస్టిస్ ఎస్.ఆర్.భట్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.
కాగా, 2018లో ఫూణేలో ఎల్గర్ పరిషత్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు కార్యకర్తల ప్రసంగాల కారణంగా భీమా కోరేగావ్‌లో మరుసటే రోజు అల్లర్లు చేలరేగాయని ఆరోపణలున్నాయి. ఈ కేసులో భాగంగా 12 మందికి పైగా సామాజిక కార్యకర్తలు, పౌరహక్కుల కార్యకర్తలను పోలీసులు అదపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిపై మరిన్ని ఆరోపణలతో ఉపా చట్టం కింద కేసులు నమోదుచేశారు. అలా అరెస్టైన వారిలో సుధా భరద్వాజ్ ఒకరు.