Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జంతర్ మంతర్లో బీసీ సంక్షేమ సంఘం ధర్నా
న్యూఢిల్లీ: జనాభా లెక్కింపులో కుల గణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నాడిక్కడ స్థానిక జంతర్ మంతర్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాకు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, మాజీ ఎంపీ అజీజ్ పాషా తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ జనాభా గణన పట్టికలో 35 కాలమ్స్ ఉన్నాయనీ, ఇంకొక కాలమ్ పెడితే నష్టమేంటనీ ప్రశ్నించారు. ఒక్క రూపాయి అదనపు ఖర్చు లేకుండా దేశంలోని కులాల జనాభ వివరాలన్నీ వస్తాయని సూచించారు. ఎందుకు బీజేపీ ప్రభుత్వం అంగీకరించటం లేదని ప్రశ్నించారు. దేశంలోని 70 కోట్ల మంది బీసీలను అభివృద్ధి చేయకుండా దేశం అగ్రదేశంగా తయారవుతుందా? అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వానికి బీసీల పట్ల ఎందుకు వివక్షా? అని ప్రశ్నించారు. ఇలా చేస్తే జాతీయ స్థాయిలో బీసీ ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో అసెంబ్లీ తీర్మానాలు చేసినట్టు తెలిపారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ కుల గణన చేయాలనే డిమాండ్ న్యాయమైనదని, దీనికి తమ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరిని అవలంభిస్తోందని విమర్శించారు. ఈ ధర్నాలో నేతలు గుజ్జ కృష్ణ, లాకా వెంగల్ రావ్, నాగేశ్వరరావు, లాల్ కృష్ణ, దాసు సురేష్, గుజ్జ సత్యం, ఆళ్ల రామకృష్ణ, కిరణ్ కర్రి వేణుమాధవ్, నీల వెంకటేష్, నీరడి భూపేష్ సాగర్, జిల్లపల్లి అంజి, చంటి ముదిరాజ్, బీసీ వెంకట్, ఉదరు, భాస్కర్ ప్రజాపతి, జయంతి, నికిల్త తదితరులు పాల్గొన్నారు.