Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడులో ఘోర ప్రమాదం
- మృతుల్లో ఆయన భార్య కూడా
- ఐఏఎఫ్ సిబ్బంది సహా 13 మంది మృతి
- రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర రక్షణ మంత్రి సహా పలువురి సంతాపం
న్యూఢిల్లీ: భారత త్రివిధ దళాల తొలి అధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న భారత వైమానిక దళ హెలికాప్టర్ కుప్పకూలడంతో రావత్‌తో పాటు ఉన్న ఆయన భార్య మధులిక రావత్ కూడా ప్రాణాలు విడిచారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఉన్న 14 మందిలో 13 మంది మృతి చెందారు. తమిళ నాడులోని కోయంబత్తూరు, సులుర్ మధ్యలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ విషయాన్ని భారత వైమానిక దళం అధికారికంగా తెలి పింది. కాగా, ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన డీఎస్ఎస్సీ డైరెక్టింగ్ స్టాఫ్ జీపీ కెప్టెన్ వరుణ్ సింగ్ ఎస్సీ వెల్లింగ్టన్ మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వివరించింది. ఆర్మీ అధికారిక కార్యక్రమంలో భాగంగా రావత్‌తో పాటు ఆయన భార్య, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది ఎంఐ-1వీ5 హెలికాప్టర్లో బయలుదేరారు. మొత్తం 14 మందితో వెళ్తున్న హెలి కాప్టర్ తమిళనాడులోని కూనురు వద్ద కుప్పకూలిందనీ ప్రమాద ఘటనానంతరం భారత వైమానిక దళం మధ్యా హ్నం తెలియజేసింది. దీనిపై విచారణకు ఆదేశించినట్టు వివరించింది. కోయంబత్తూర్‌లోని సులుర్ ఐఏఎఫ్ బేస్ నుంచి వెల్లింగ్టన్కు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ప్రమాదంలో బిపిన్ రావత్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారమూ అందకపోవడం ఆందోళనకరంగా మారింది. కాగా, ప్రమాద ఘటన తెలిసిన వెంటనే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రమాదంలో గాయపడినవారికి సరైన వైద్యం అందిం చాలనీ, సహాయక చర్యలు కొనసాగించాలని ఆదేశించారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే ఐఏఎఫ్ చీఫ్ వివేక్ రామ్ చౌధరీ తమిళనాడులోని సులుర్ ఎయిర్ బేస్‌కు చేరుకు న్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటన అనంత రం కేంద్ర క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. హెలి కాప్టర్ ప్రమాదం గురించి ప్రధానికి రాజ్‌నాథ్ సింగ్ వివరిం చారు. అంతకముందు, రాజ్‌నాథ్‌సింగ్ ఢిల్లీలోని రావత్ నివాసానికి వెళ్లివచ్చారు. కాగా, ప్రమాద ఘటనలో తొలుత రావత్ బయటపడ్డారనీ అంతా భావించారు. అయితే, డీఎన్ఏ పరీక్ష వివరాల సహాయంతో.. చివరకు ఆయన కూడా మృతి చెందినట్టు వైమానిక దళం ప్రకటించింది.
'పెద్ద శబ్దం వినబడింది.. భారీగా మంటలు ఎగిశాయి'
హెలికాప్టర్ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు వివరించారు. '' భారీగా శబ్ధం వినబడింది. ఏం జరిగిందో తెలసుకోవడానికి ముందుకు కదిలాను. చెట్టును హెలికాప్టర్ ఢ కొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. అనంతరం మరో మూడు చెట్లను కూడా హెలికాప్టర్ ఢ కొట్టింది. హెలికాప్టర్ నుంచి మృతదేహాలు బయటపడ్డాయి. ఈవిషయాన్ని స్థానికులకు, అధికారులకుచేరవేశాను'' అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
20 ఏండ్ల వయసులో మిలిటరీలోకి
ఆయన పూర్తి పేరు బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్. ఆయన మార్చి 16, 1958లో ఉత్తరాఖండ్‌లోని పౌరీలో జన్మించారు. ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్.. లెఫ్టినెంట్ జనరల్. ఆయన కుటుంబం అనేక తరాలుగా మిలిటరీకి సేవలు అందిస్తున్నది. 20 ఏండ్ల వయసులో 1978 డిసెం బర్ 16న 11 గోర్ఖా రైఫిల్స్ ఐదో బెటాలియన్‌లో చేరికతో ఆయన మిలిటరీ కెరీర్ ప్రారంభమైంది. రావత్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు సంతాపం ప్రకటించారు.
హెలికాప్టర్ ప్రమాద మృతుల్లో తెలుగు సైనికుడు..
ఈ ప్రమాదంలో ఏపీ వాసి సాయితేజ్ కూడా మృతి చెందాడు. ఇతడి స్వస్థలం చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువరేగడ గ్రామం. సాయితేజ్ రక్షణ శాఖలో లాన్స్ నాయక్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సీడీఎస్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా సాయితేజ్ విధులు నిర్విహిస్తున్నారు. 2013లో ఆర్మీలో చేరాడు. సాయితేజ్ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సాయితేజ్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. చివరిసారిగా వినాయక చవితికి సాయితేజ్ స్వగ్రామానికి వచ్చినట్టు బంధువులు తెలిపారు.
ప్రాణాలతో బయటపడిన కెప్టెన్ ఈయనే..!
హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న 14 మందిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనే గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్. తీవ్రంగా గాయపడిన ఆయన వెల్లింగ్టన్లోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వరుణ్ సింగ్ ఇండియన్ ఆర్మీలో ఆయన విశేష సేవలందించారు. ఈ ఏడాది ఆగస్టులోనే భారత ప్రభుత్వం వరుణ్ సింగ్‌ను శౌర్య చక్ర అవార్డుతో సత్కరించింది.