Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారికంగా లిఖితపూర్వక ఆర్డర్ రావాలి : రైతు నేతలు
- ఉద్యమం ముగింపుపై నేడు భేటీ
న్యూఢిల్లీ: సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రతిపాదిత సవరణలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రభుత్వం పంపిన ముసాయిదా ప్రతిపాదనలకు ఎస్కేఎం సవరణలు ప్రతిపాదిస్తూ తిరిగి కేంద్రానికి పంపింది. కిసాన్ మోర్చా పంపిన సవరణలకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీనిపై ఎస్కేఎంలో ఏకాభిప్రాయం కుదిరింది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా లిఖితపూర్వక ఆర్డర్ రావాల్సి ఉందని ఎస్కేఎం స్పష్టం చేసింది. రైతు ఉద్యమం ముగింపుపై నేడు (గురువారం) సింఘూ సరిహద్దు వద్ద ఎస్కేఎం సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని రైతు నేతలు స్పష్టం చేశారు. ఐదు ప్రతిపాదనల ముసాయిదాను ఎస్‌కేఎంకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం పంపిన విషయం తెలిసిందే. దీనికి ఎస్కేఎం కొన్ని సవరణలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. బుధవారం నాడిక్కడ ఎఐకేఎస్ కార్యాలయంలో ఎస్కేఎం ఐదుగురు సభ్యుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భం గా ఎస్కేఎం పంపిన సవరణపై ఫోన్లో కమిటీ సభ్యులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘ చర్చల తరువాత కొన్ని అంశాలపై స్పష్టత వచ్చింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు అశోక్ ధావలే, బల్బీర్ సింగ్ రాజేవాల్, గుర్నామ్ సింగ్ చారుని, శివకుమార్ కక్కాజీ, యుద్వీర్ సింగ్ మాట్లాడారు. 'ఎస్కేఎం ప్రతిపాదించిన సవరణలపై కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. సింఘూ సరిహద్దు వద్ద సమావేశంలో చర్చించి నిర్ణయాన్ని వెల్లడిస్తాం' అని తెలిపారు. అనంతరం సింఘూ సరిహద్దు వద్ద ఎస్కేఎం సమావేశం జరిగింది. అక్కడ ఎస్కేఎం నేతలు మీడియాతో మాట్లాడారు. తమ సవరణలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందనీ, దీనిపై ఎస్కేఎంలో ఏకాభిప్రాయం కుదిరిందని తెలిపారు. ప్రభుత్వ లెటర్ హెడ్‌పై సంతకం చేసిన అధికారిక సమాచారం కోసం వేచి చూస్తున్నామనీ, నేడు (గురువారం) 12 గంటలకు సింఘూ సరిహద్దు వద్ద ఎస్కేఎం సమావేశం అవుతుందని తెలిపారు. ఆ సమావేశంలో ఉద్యమం ఆపివేయడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రైతు ఉద్యమం సమయంలో ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమా చల్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో రైతులపై అక్రమంగా బనాయించిన కేసులను రైతు ఉద్యమం ముగించిన తరువాత ఉపసంహరించుకుం టామని కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ముందు కేసులు ఉపసంహరించుకోవాలనీ, ఆ తర్వాతే ఉద్యమం ఆపుతామంటూ ఎస్కేఎం సవరణ కోరింది. వెంటనే కేసుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం కేసులను ఉపసంహరించుకుంది. అలాగే రైతులకు పరిహారానికి సంబంధించి.. హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు సూత్రప్రాయ అంగీకారం తెలిపాయని కేంద్రం ప్రతిపాదించింది. దానికి సూత్రప్రాయ అంగీకారం కాదనీ, కేంద్రమే ఆ రెండు రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని సూచించింది. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టపరమైన హామీ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామనీ, ప్యానెల్లో ఎస్కేఎం వెలుపల ఉన్న రైతు సంఘాలు, ప్రభుత్వ అధికారులు, ప్రతినిధులు ఉంటారని ప్రభుత్వ ప్రతిపాదన తెలిపింది. దీనిపై ఎస్కేఎం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మొదటి నుంచి రైతు డిమాండ్లకు వ్యతిరేకంగా ఉన్నవారు ఎంఎస్పీ కమిటీలో ఉండకూడదని ఎస్కేఎం స్పష్టంచేసింది. అలాగే విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకుంటామని గత చర్చల్లో హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వారు దానిని వాటాదారులతో చర్చించి పార్లమెంటులో పెట్టాలనుకుంటున్నారు. ఇది ఆమోద యోగ్యం కాదు. ఈ అంశాలపై కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్టు సమాచారం.