Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహకరించిన వారికి రుణపడి ఉంటాం
- రైతు ఉద్యమం దేశానికే ఓ సందేశం:ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే 13 నెలల చారిత్రాత్మక ఉద్యమం విజయవంతమైందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ పేర్కొన్నారు. సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ అంత్యక్రియలు నేడు (శుక్రవారం) జరగనున్న నేపథ్యంలో విజయోత్సవాలు జరపడం భావ్యం కాదనీ, శనివారం సింఘూ వద్ద విజయోత్సవాలను నిర్వహించాలని ఎస్కేఎం నిర్ణయించిందని తెలిపారు. సింఘూతో పాటు టిక్రీ, ఘాజీపూర్, షాజహన్‌పూర్ సరిహద్దుల వద్ద కూడా విజయోత్సవాలు నిర్వహిస్తామనీ, అనంతరం శనివారం రైతులంతా తమ ఇండ్లకు వెళ్తారని పేర్కొన్నారు. గురువారం నాడిక్కడ స్థానిక ఏపీ భవన్లో వెంకట్ మీడియాతో మాట్లాడుతూ 2020 నవంబర్ 26న ప్రారంభమైన రోడ్ల దిగ్బంధనాన్ని విరమిస్తామని అన్నారు. ఈ చారిత్రాత్మక పోరాటంలో రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులతో సహా సమస్త ప్రజానీకం పాల్గొన్నారని తెలిపారు. దాదాపు 50 దేశాల్లో ఉన్న భారతీయులు సంఘీభావంగా నిలిచారని, అలాగే విదేశాల్లోని రైతు సంఘాలు, మేథావులు మద్దతుగా నిలిచారని అన్నారు. ఈ విజయం రైతాంగ విజయం మాత్రమే కాదని, దేశ ప్రజల విజయమనీ, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విజయమని తెలిపారు. 75 ఏండ్ల రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న నేపథ్యంలో పోరాడితే విజయం సాధించుకోవచ్చనన్న సందేశాన్ని దేశ ప్రజలకు ఈ ఉద్యమం ఇచ్చిందని స్పష్టం చేశారు. దేశ ప్రజల మద్దతు, అంతర్జాతీయ సంఘీభావం ఉండటంతోనే ఈ ఉద్యమం సుదీర్ఘంగా కొనసాగిందని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుయుక్తలు పన్నినప్పటికీ పోరాటంలో పాల్గొన్న, మద్దతు, సంఘీభావం ఇచ్చిన వారందరికీ, ఐదు సరిహద్దుల రైతు ఉద్యమానికి సహకరించిన స్థానిక ప్రజలకు తాము రుణపడి ఉంటామని అన్నారు.
రైతు సంఘాలన్నీ ఐక్యంగా పోరాడటంతోనే..
కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి అవకాశవాదంతో వ్యవహరించిందనీ, ఇప్పుడు కూడా తప్పించుకునే ప్రయత్నం చేసిందని అన్నారు. అయినప్పటీకి రైతు సంఘాలన్నీ ఐక్యంగా ఉండటంతో ప్రభుత్వం తలొగ్గిందని స్పష్టం చేశారు. ఎస్కేఎం డిమాండ్లకు అంగీకారం తెలిపిందన్నారు. గతంలో ఉద్యమం విరమించుకుంటే కేసులు ఉపసంహరించుకుంటామని కేంద్రం చెప్పిందని, ఇప్పుడు అలాకాకుండా బేషరతుగా కేసుల ఉపసంహరణకు అంగీకారం తెలిపిందన్నారు. ఎంఎస్పీ కమిటీలో ఎస్కేఎం ప్రతినిధులను తీసుకోవడంతో పాటు, ఎంఎస్పీ గ్యారెంటీ అనేదాన్ని చేర్చారని అన్నారు. అలాగే ఎంఎస్పీ గ్యారెంటీకి సంబంధించిన విధివిధానాలను రూపొంచేందుకే ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపిందని అన్నారు. విద్యుత్ బిల్లు విషయంలో ఎస్కేఎంతో చర్చించే ముందుకు వెళ్తామని స్పష్టం చేసిందన్నారు. పరిహారం తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాత ఉద్యమాన్ని విరమించాలని ఎస్కేఎం నిర్ణయించిందన్నారు.
మోడీ గుణపాఠాలు నేర్చుకోవాలి
ప్రధాని మోడీ ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని, రాజ్యాంగాన్ని విలువ ఇవ్వాలని సూచించారు. దేశమంటే అదానీ, అంబానీలే కాదని, కోట్లాది మంది ప్రజలని మోడీ ప్రభుత్వం తెలుసుకోవాలని హితవు పలికారు.
పండిన ప్రతి గింజ కొనాలి...
తెలంగాణలో రైతుల సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించిన తీరు సరిపోదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయటం లేదని ఆందోళన చేశారని, ఇప్పుడు పార్లమెంట్‌ను బహిష్కరించి వెళ్లిపోయారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లులో కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందని, ధాన్యం సేకరణ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందని అన్నారు. లక్షల కోట్ల విలువైన ఆస్తులన్ని ఎఫ్‌సీఐ పేరుతో కేంద్రం చేతుల్లో ఉన్నాయని తెలిపారు. అమరావతిపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలి
ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి అంశంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొండిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.