Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నదాత ఉద్యమం ముందు మోకరిల్లిన మోడీ సర్కార్
- చేతులెత్తేసిన కార్పొరేట్లు.. దళారుల ముఠా
- ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టలేరన్న సంకల్పబలం
- కనీస మద్దతుధర సాధించేదాక పోరు ఆగదు..:రైతు సంఘాలు
న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం ఏ చట్టం తెచ్చినా..ఏ నిర్ణయం తీసుకున్నా..అది ప్రజావ్యతిరేకమైనవే ఎక్కువగా ఉంటున్నాయని దేశప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పార్లమెంట్లో నల్లచట్టాలు ప్రవేశపెడుతున్నపుడు ఎంతగా వద్దన్నా..వినలేదు. చివరికి ఏడాది తర్వాత రైతుల జోలికివెళ్తే..మాడు పగలటం ఖాయమన్న విషయాన్ని గుర్తించింది. అన్నదాతలతో పెట్టుకుంటే..అధికారం కూడా ఊడటం ఖాయమనే సంకేతాలు మోడీ బృందాన్ని భయపెట్టాయని స్పష్టమవుతున్నది. అదే చారిత్రాత్మక రైతాంగ ఉద్యమ విజయానికి దారి తీసిందని చెప్పవచ్చు. సరిగ్గా.. ఏడాది కిందట రాజ్యాంగ దినోత్సవం రోజున ప్రారంభమైన రైతు ఉద్యమం.. ప్రపంచంలోనే అద్వితీయమైన ఉద్యమంగా.. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా దిగ్విజయంగా ముగియనున్నది.
దేశంలో అత్యధికమంది వ్యవసాయం మీదే ఆధారపడుతున్నారు. రైతు లేనిదే రాజ్యం లేదన్న విషయం కేంద్రంలో వచ్చే పాలకులకు తెలియనిదేం కాదు. అయితే ఉద్యమంపై ఎన్నోపరిశోధనలు మరెన్నో.. అధ్యయనాలు చాలా కాలం జరిగాయి. అయితే ప్రాథమికంగా దాని యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి.
ప్రపంచానికి కొత్త ఆశ కలిగించిన రైతు ఉద్యమం
దేశానికి, బహుశా ప్రపంచానికి కొత్త ఆశను చిగురింప జేసింది. ప్రపంచంలోని అత్యంత దుర్మార్గపు నిరంకుశ ప్రభుత్వాలలో ఒకటైన మోడీ-షా ద్వయం. కమలం పార్టీపై పిడికిలెత్తిన అన్నదాతను ఉక్కుపాదంతో అణచివేయాలని చూసింది. కానీ రైతు ఉద్యమం జరిగిన తీరు చూస్తే...ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పాలకులు తీసుకునే చట్టాలు..నిర్ణయాలపై ''ప్రజలు పోరాడుతారు, ప్రజలే గెలుస్తారు'' అనే ఆశను పునరుద్ధరించారు. ప్రజలే నిజమైన చరిత్ర సృష్టికర్తలు అని రుజువైంది. ఒక రకంగా చెప్పాలంటే... ఇది మన రాజ్యాంగ విలువలకు కూడా విజయం, ఈ అపూర్వమైన పోరాటం..భవిష్యత్ ఉద్యమాలకు మరింత ఊతమివ్వటం ఖాయమన్న చర్చ దేశప్రజల్లో వ్యక్తమవుతున్నది.
కార్పొరేట్‌ను కూకటివేళ్లతో...
ప్రపంచాన్ని శాసించే ఆర్థిక మూలాలు, కార్పొరేట్ సంస్థలు రైతులవైపు చూస్తే..ఏమవుతుందో.. చట్టాలను రద్దు చేయించడంలో రైతు ఉద్యమం విజయవంతమైంది. ఇది సమకాలీన వ్యవస్థలో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడి గెలవడానికి ఇది మొత్తం ప్రపంచంలోని శ్రామిక ప్రజలను ప్రోత్సహించింది. పోరులోనూ కొత్త మార్గాన్ని చూపింది. రాబోయే రోజుల్లో.. దేశంలో నయా ఉదారవాద దాడులకు వ్యతిరేకంగా మరిన్ని పెద్ద పోరాటాలకు రైతు ఉద్యమం నాందిపలకనున్నది.
నాటి స్వాతంత్య్రపోరాటంలో..
దేశానికి స్వాతంత్య్రం కోసం పోరాటం జరిపినపుడు గాంధీ, కమ్యూనిస్టులు,సోషలిస్టులు,కుల,మత,ప్రాంతమనే బేధాల్లేకుండా ఉద్యమించారు. ఇపుడు కూడా ఆ తరహాలో రైతులతో కలిసి సల్పిన ఉద్యమం..స్వాతంత్య్ర పోరాటాన్ని గుర్తుకు తెచ్చిందనే చర్చ నడుస్తున్నది. అయితే రాజకీయాలు భారత సమాజానికి అతిపెద్ద బలహీనతగా చెప్పవచ్చు. దీన్ని అడ్డంగా పెట్టుకుని నల్లచట్టాలు అమలు చేయాలనుకున్న మోడీకి చుక్కెదురైంది. చివరకు తలొగ్గకతప్పలేదు. ఈ చారిత్రక ఉద్యమంలో కూడా రైతు నాయకులతోపాటు కమ్యూనిస్టులు, సోషలిస్టులు నిర్ణయాత్మక పాత్ర పోషించి సత్యాగ్రహం, ప్రజాఉద్యమం ద్వారా విజయం సాధించడం యాదృచ్ఛికం కాదు.
హక్కులపట్ల స్పృహ..పౌరస్పృహ వెరసి ఉద్యమబాటలు..
రైతులలో వారి హక్కుల పట్ల స్పృహ, పౌర స్పృహ కూడా తోడైంది. ప్రభుత్వ నిర్ణయాలకు తాము నిష్క్రియములు కాదనీ, విధానాల రూపకర్తలమన్న వాస్తవాలను గ్రహించారు. దీని పర్యవసానమే..ఒక బలమైన శక్తిగా రైతులు ఆవిర్భవించడం మన ప్రజాస్వామ్యానికి శుభదాయకం. రాబోయే రోజుల్లో మన సమాజానికి,రాజకీయాలకు చాలా విస్తృతమైన పరిణామాలను కలిగించగలదన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది.
జాతీయ ఎజెండా ఎంఎస్పీ
కనీసమద్దతు ధర (ఎంఎస్పీ )ఇపుడు జాతీయ ఎజెండాగా మార్చింది. ఇప్పటి వరకు పంజాబ్-హర్యానాలోని ఒక చిన్న విస్తీర్ణంలోని రైతులకు మాత్రమే తెలిసిన ఎంఎస్పీ...ఇపుడు దేశంలోని ప్రతి రైతూ సాధించాలనే తపన వెనుకబడిన ప్రాంతాల్లోని రైతుల్లోనూ నింపటం శుభపరిణామం. ఆ మేరకు ప్రభుత్వం నుంచి హామీ పొందటం..ఓ కమిటీ ఏర్పాటులోనూ రైతు సంఘాలు సఫలీకృతమయ్యాయి. ఎంఎస్పీని పూర్తిగా అమలు చేయడానికి..భవిష్యత్తులో కిసాన్ ఆందోళన పార్ట్-2 కూడా అవసరాన్ని బట్టి ఉంటుందని రైతు సంఘాల నేతలు అంటున్నారు.
అందరినోళ్లలో రైతు ఉద్యమం...
ఈ ఉద్యమం జరిగిన తీరుతో.. దేశం మొత్తం చర్చించుకునే విధంగా మార్చేసింది. విభజన రాజకీయాలు జాతీయ సమైక్యతకు, గంగా-జమ్నీ తహజీబ్‌కు కోలుకోలేని నష్టాన్ని బనాయించాలని మోడీ ప్రభుత్వం యత్నించినా..రైతాంగ ఉద్యమం పూర్తిగా తిప్పికొట్టింది. ఇది జాతీయ ఐక్యత, సౌభ్రాతృత్వం, మత సామరస్యాన్ని బలోపేతం చేసింది. మొత్తం దేశంలోని రైతులను మతం-సంఘం-కులం-ప్రాంతం-లింగం అనే రేఖల కతీతంగా ఐక్యతతో పోరాడే శక్తిలా ఉద్యమం ఎదిగింది. విభజన ఎజెండాను వెనక్కి నెట్టింది. 2022 యూపీలో యోగి సర్కార్, 2024లో మోడీ నిష్క్రమణకు స్క్రిప్ట్‌ను రూపొందించిన సంఫ్‌ు-బీజేపీ అవకాశవాద రాజకీయ ఇది ఘోరమైన దెబ్బేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఎన్నో త్యాగాలు..
ఈ మహా ఉద్యమంలో 700 వందల మందికి పైగాఅమరులయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులపై చెప్పలేనన్ని చిత్రహింసలకు గురిచేసినా వెనకడుగువేయలేదు.
ఈ ఉద్యమాన్ని చివరిదాకా తీసుకెళ్లి, మన వ్యవసాయాన్ని స్వాధీనం చేసుకుని మన గణతంత్రాన్ని నాశనం చేసేందుకు సామ్రాజ్యవాద, కార్పొరేట్ శక్తుల ప్రయత్నాలను అన్నదాతలు తిప్పికొట్టారు. ఈ ఉద్యమం అనేక అపోహలను బద్దలు కొట్టింది. స్థాపిత నాయకత్వం, ఆకర్షణీయమైన ముఖం లేకపోయినా, ఒక గొప్ప ఉద్యమం నిలబడి విజయం సాధించగలదని నిరూపించింది.ఈ ఉద్యమం కోసం పోరాడిన అసంఖ్యాక యోధులకు కృతజ్ఞతతో కూడిన దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. ఫాసిస్ట్ దుండగుల నుంచి రక్షించబడిందనేది మాత్రం సుస్పష్టం..