Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జర్నలిస్టుల నిర్బంధాలు
- గతంలో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక మంది జైలుకు
- స్వత్రంత్ర రిపోర్టింగ్‌పై పెరుగుతున్న అసహనం: సీపీజే రిపోర్టు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులను నిర్బంధించడం, వారిపై దాడులు చేయడం, ప్రాణాలు తీయడం వంటి చర్యలు అధికమవు తున్నాయని కమిటీ టూ ప్రొటెక్ట్ జర్నలిస్టు (సీపీజే) నివేదిక పేర్కొంది. ఏడాదికేడాది ఈధోరణి క్రమంగా పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. జైలుపాలవుతున్న పాత్రికే యుల సంఖ్య 2021లో గరిష్టంగా పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. జర్నలిస్టులపై దాడులు, నిర్బంధాలకు సంబంధించిన అం శాలు ఒక్కొదేశంలో ఒక్కొ విధంగా ఉన్నప్పటికీ మొత్తంగా ఆయా దేశాల్లో ప్రభుత్వాల లోపాలు, స్వతంత్ర రిపోర్టింగ్ చేయడం అనే అంశం ప్రధానంగా కనిపిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా జైలుశిక్షను అనుభవిస్తున్న పాత్రికే యుల సంఖ్య ఈ ఏడాదిలో అత్యధికంగా ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి డిసెంబర్ 1 వరకు ఉన్న తీసుకున్న సమాచారం ప్రకారం మొత్తం 293 మంది జర్నలిస్టులు నిర్బంధించబడ్డారు. వారు అందించిన వార్తల కవరేజీ కారణంగా దాడికి గురై 24 మంది జర్నలిస్టులు మరణించారు. మరో 18 మంది జర్నలిస్టులు వారి వృత్తి కారణంగా వారి ప్రాణాలు తీశారా? లేదా వారికి లక్ష్యంగా చేసుకుని చంపారా? అనేది నిర్ధారించడం కష్టంగా మారింది. 250 మందికి పైగా జర్నలిస్టులను జైలుపాలు చేయడం వరుసగా ఇది ఆరో ఏడాది అని సీపీజే గణాంకాలు పేర్కొంటున్నాయి. దేశాల్లో రాజకీయ వైఫల్యాలు, పలు ఘటనలపై స్వతంత్ర రిపోర్టు చేయడంతోటి జర్నలిస్టులను జైలులో పెట్టడం అనేది పాత్రియంపై పెరుగుతున్న అసహనాన్ని ప్రతిబింబిస్తుందని సీపీజే నివేదిక పేర్కొంది. జర్నలిస్టులను అధికంగా రికార్డు స్థాయిలో జైలు నిర్బంధంలో పెట్టడం సీపీజే గుర్తించడం ఇది వరుసగా ఆరో ఏడాది అని సీపీజే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోయెల్ సైమన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సమాచారాన్ని నిర్వహించడం, నియంత్రించం అనే రెండు అంశాలే వారిని క్లిష్ట పరిస్థితుల్లోకి దించుతున్నాయని ఆయన అన్నారు. ఈ ఏడాదిలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల దారుణాలు కవర్ చేయడానికి వెళ్లిన డానిష్ సిద్ధిఖీని ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఇదే తరహాలో మెక్సికోలో గుస్తావో సాంచెజ్ కాబ్రెరాను కాల్చిచంపారు.సీపీజే నివేదిక ప్రకారం అత్యధికంగా చైనాలో 50 మందికి పైగా జర్నలిస్టులను ఖైదు చేశారు. ఆ తర్వాతి స్థానంలో మయన్మార్ (26), ఈజిప్ట్ (25), వియత్నాం (23), బెలారస్ (19) దేశాలు ఉన్నాయి. మొదటి సారి సీపీజే జాబితాలో హాంగ్ కాంగ్లో ఖైదు చేయబడిన జర్నలిస్టులు ఉన్నారు.
ఇక మెక్సికోలో క్రిమినల్ ముఠాలు, అవినీతి అధికారుల చర్యలను జర్నలిస్టులు కవర్ చేసినప్పుడు వారిపై దాడులు జరగడంతో పాటు ఖైదు కూడా చేయబడుతున్నారు. పశ్చిమార్థ గోళంలోనే మెక్సికో జర్నలిస్టులకు అత్యంత దారుణమైన దేశంలో నిలిచిందని సీపీజే నివేదిక పేర్కొం ది. భారత్‌కు చెందిన మరో జర్నలిస్టు అవినాష్ జా (బీఎన్ఎన్ న్యూస్) మెడికల్ మాఫియాను కవర్ చేసినందుకు బీహార్‌లో ఆయన ప్రాణాలు తీశారు. సుదర్శన్ టీవీకి చెందిన మనీష్ కుమార్ సింగ్ ఉగ్రవాద చర్యలను కవర్ చేయడంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. సీపీజే నివేదికలో భారత్ 13వ స్థానంలో ఉన్న ఉన్నప్పటీకీ.. ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ సర్కారు తమకు అనుకూలంగా లేని, ప్రభుత్వ వైఫల్యాను ఎత్తిచూపిన, అసమ్మతి కథనాలను బయటకు రాకుండా అడ్డుకున్నది. చాలా ఆందోళనలతో పాటు రైతు ఉద్యమం సమయంలోనూ ఇంటర్నెట్ షట్ డౌన్ వంటి చర్యలకు పాల్పడింది. ఆయా అంశాలను కవరేజీ ఇవ్వకుండా జర్నలిస్టులను అడ్డుకున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. దీనికి జమ్మూకాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలే నిదర్శనం అని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేగాకుండా జర్నలిస్టులపై ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ పెగాసస్ స్పైవేర్‌తో నిఘా పెట్టారనే ఆరోపణలూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది. మోడీ ప్రభుత్వం అసమ్మతిని అణచివేస్తున్న చర్యల నేపథ్యంలో దేశంలో అనేక అంతర్జాతీయ హక్కుల సంస్థల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నది.